కాజీపేట అర్బన్: అక్రమ రిజిస్ట్రేషన్లు, వసూళ్లు, డాక్యుమెంట్లను సకాలంలో జారీ చేయట్లేదనే ఫిర్యాదులతో గురువారం సబ్ రిజిస్ట్రార్లు రామనరసింహారావు, ఆనంద్‌ను ఏసీబీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. గురువారం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి శుక్రవారం తెల్లవారుజామున సుమారు 3.30 గంటల వరకు 12 గంటల పాటు విచారణ కొనసాగింది. అదే విధంగా.. ఖమ్మం, హనుమకొండ బ్రాహ్మణవాడలోని జాయింట్–1 సబ్ రిజిస్ట్రార్ రామనరసింహారావు ఇళ్లల్లో, జాయింట్–2 సబ్ రిజిస్ట్రార్ ఆనంద్ నివాసం ఉంటున్న ఖమ్మం, గోపాల్‌పూర్‌లోని అద్దె ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 20 మంది డాక్యుమెంట్ రైటర్లు 70 డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు గాను 47,500 రూపాయలతో పట్టుబడగా, 204 డాక్యుమెంట్లు డబ్బుల డిమాండ్ తిరిగి ఇవ్వకపోవడంతో జారీ చేయలేదని విచారణలో తేలింది. రిజిస్ట్రేషన్ కార్యాలయంలోని డాక్యుమెంట్ రైటర్ల నుంచి ప్రైవేట్ వ్యక్తి ద్వారా రూ.42,03,125 ఫోన్‌పే లావాదేవీలను, ఇద్దరు సబ్ రిజిస్ట్రార్ల ఇళ్లపై దాడి చేసి రూ.24,61,540 నగదు, సబ్ రిజిస్ట్రార్ ఆనంద్ ఇంట్లో 819.500 గ్రాముల బంగారం, 2.600 కిలోగ్రాముల వెండి ఆభరణాలు, కపిల్ చిట్స్‌లో 30,10,000 ఎఫ్‌డీ బాండ్లను స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
తర్వాత ఎవరు?
వరంగల్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గురువారం, శుక్రవారం నిర్వహించిన ఏసీబీ దాడులతో రిజిస్ట్రేషన్ శాఖ ఉలిక్కిపడింది. ఉమ్మడి జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉద్యోగులు తర్వాత ఎవరు అని జంకుతున్నారు.
12 గంటల పాటు ఏసీబీ తనిఖీలు
ఏకకాలంలో ఖమ్మం,
హనుమకొండలో దాడులు
సబ్ రిజిస్ట్రార్లలో వణుకు


