విద్యారణ్యపురి: టెన్త్ వార్షిక పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే తెలుగు, హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్ సబ్జెక్టుల పరీక్షలు పూర్తయ్యాయి. ఈ క్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రం కాజీపేటలోని ఫాతిమా హైస్కూల్‌లో స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియను ఏప్రిల్ 1వ తేదీ నుంచి నిర్వహించనున్నారు. ఈసారి మూడు దశల్లో వాల్యుయేషన్ నిర్వహించనున్నారు. ఈ క్యాంపునకు విద్యాశాఖ ఉన్నతాధికారులు అన్ని సబ్జెక్టులు కలిపి 2,40,100 జవాబుపత్రాలు కేటాయించారు. ప్రస్తుతం తెలుగు, హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్ జవాబుపత్రాలు రాగా కోడింగ్ డీకోడింగ్ ప్రక్రియ కూడా పూర్తికావొచ్చింది. ఈ క్యాంపు ఆఫీసర్‌గా హనుమకొండ డీఈఓ గిరిరాజ్‌గౌడ్ వ్యవహరిస్తున్నారు. డిప్యూటీ క్యాంపు ఆఫీసర్లుగా ఏసీజీఈ భువనేశ్వరి, ఎంఈఓ హనుమంతురావు వ్యవహరిస్తున్నారు.
నేటినుంచి మొదటి దశలో స్పాట్ ప్రక్రియ
ఫాతిమా హైస్కూల్ స్పాట్ కేంద్రంలో బుధవారం నుంచి 9వతేదీవరకు తెలుగు, హిందీ,ఇంగ్లిష్, మ్యా థ్స్ సబ్జెక్టుల పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం ప్రారంభించనున్నారు. ఇందుకు 600 మంది ఉపాధ్యాయులను ఏఈలుగా, సీఈలు,స్పెషల్ అసిస్టెంట్లుగా నియమించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హనుమకొండ, వరంగల్, ములుగు,జయశంకర్ భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్ జిల్లాలోని సీనియరీటీ ప్రకారం ఆయా టీచర్లను స్పాట్ విధులకు కేటాయించారు. వీరు ఉదయం 8.30 గంటలకు క్యాంపులో తప్పనిసరిగా రిపోర్టు చేయాల్సింటుది. లేనిపక్షంలో శాఖపరమైన చర్యలు ఉంటాయని సంబంధిత అధికారులు తెలిపారు.అన్ని సబ్జెక్టులు కలిపి మొత్తం 1,250 మంది ఉపాధ్యాయుల వరకు నియామాక ఉత్తర్వులు అందజేశారు.
రెండోదశలో 10 నుంచి 17వ తేదీ వరకు..
టెన్త్ మూల్యాంకనం రెండోదశలో ఏప్రిల్ 10 నుంచి 17వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ సబ్జెక్టుల పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం చేపట్టనున్నారు.
మూడోదశలో 15 నుంచి 23వ తేదీ వరకు..
మూడో దశలో టెన్త్ పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం 15 నుంచి 23వ తేదీ వరకు చేపటనున్నారు. ఇందులో సోషల్ స్టడీస్, ఒకేషనల్ కోర్సుల సబ్జెక్టులు ఉంటాయి. నియామకమైన ఉపాధ్యాయులందరూ మూల్యాంకన విధుల్లో పాల్గొనాల్సి ఉంటుంది.
విధులు సక్రమంగా నిర్వర్తించాలి..
టెన్త్ జవాబుపత్రాల మూల్యాంకన విధులు సక్రమంగా నిర్వర్తించాలని క్యాంపు ఆఫీసర్, హనుమకొండ జిల్లా డీఈఓ ఎల్‌వీ గిరిరాజ్‌గౌడ్ కోరారు. ఈ మేరకు మంగళవారం కాజీపేట ఫాతిమాహైస్కూల్ స్పాట్ కేంద్రంలో సంబంధిత డిప్యూటీ క్యాంపు ఆఫీసర్లు, అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్లుతో నిర్వహించిన సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు.
ఈసారి మూడు దశల్లో
వాల్యుయేషన్ ప్రక్రియ
2,40,100 జవాబు పత్రాలు
కేటాయింపు
1, 250 మంది వరకు టీచర్లకు విధులు
ఫాతిమా హైస్కూల్‌లో స్పాట్ కేంద్రం


