కాజీపేట అర్బన్ : రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయాన్ని పెంచుకునేందుకు గాను రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ ఈనెల 28, 30, 31వ తేదీల్లో ప్రత్యేక స్లాట్ బుకింగ్స్‌తో పాటు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8:30 వరకు పని వేళలు నిర్ణయించింది. దీంతో వరంగల్ ఆర్వో కార్యాలయంలో 28వ తేదీ 149, 30వ తేదీ 170, 31వ తేదీ 110 దస్తావేజులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను సబ్ రిజిస్ట్రార్లు రామనరసింహారావు, ఆనంద్ పూర్తి చేశారు. ఈ మూడు రోజుల్లో 429 దస్తావేజులు రిజిస్ట్రేషన్ కాగా సుమారు రూ.2 కోట్ల ఆదాయం సమకూరినట్లు సమాచారం.
వరంగల్ స్పోర్ట్స్ : రాష్ట్రంలోని వివిధ క్రీడా పాఠశాలల్లో ప్రవేశాల కోసం రెండ్రోజుల పాటు నిర్వహించిన జిల్లా స్థాయి ఎంపికలు మంగళవారం ముగిశాయి. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో హనుమకొండలోని జేఎన్‌ఎస్‌లో నిర్వహించిన ఎంపిక పోటీల్లో 55 మంది విద్యార్థులు పాల్గొన్నట్లు ఇన్‌చార్జ్ డీవైఎస్‌ఓ శ్రీమన్నారాయణ తెలిపారు. ఇందులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ఈ నెల 27న హైదరాబాద్‌లోని హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ జరిగే రాష్ట్రస్థాయి ఎంపికల్లో పాల్గొంటారని తెలిపారు. డీఎస్‌ఏ కోచ్‌లు నరేందర్, విష్ణువర్ధన్, శంకర్, రాజు, ప్రభుదాస్, అఫ్జల్, రమేశ్, దేవిక పాల్గొన్నారు.


