వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద
న్యూశాయంపేట : కార్మికుల సంక్షేమ సేవల్లో పారదర్శకతను మరింతగా పెంచేందుకు చర్యలు చేపట్టినట్లు వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. తెలంగాణ భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పనితీరుపై కలెక్టరేట్ కార్యాలయానికి అందిన ఫిర్యాదులపై కార్మిక శాఖ, గుర్తింపు పొందిన ట్రేడ్ యూనియన్ల ప్రతినిధులతో కలెక్టరేట్‌లో మంగళవారం ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్మికుల నమోదు, క్లయిమ్ దరఖాస్తుల సమర్పణ, పరిశీలన, ఆమోద ప్రక్రియలు పూర్తిగా పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ ప్రక్రియలో మధ్యవర్తుల జోక్యం పెరుగుతుండంతో నిజమైన లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తద్వారా వ్యవస్థపై విశ్వాసం సన్నగిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యవర్తుల ప్రమేయాన్ని పూర్తిగా అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కార్మిక శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పారదర్శకత, జవాబుదారీ తనం ఉండేలా తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర నివేదిక సిద్ధం చేసి సమర్పించాలని సూచించారు. సమావేశంలో అధికారులు, ట్రేడ్ యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
అంబేడ్కర్ జయంతి నిర్వహణపై సమీక్ష
డాక్టర్ బీఆర్.అంబేడ్కర్, జగ్జీవన్‌రామ్ జయంతి ఉత్సవాల నిర్వహణపై ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సత్యశారద సూచించారు. అందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అధికారులు, వివిధ సంఘాల నాయకులతో కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన సమావేశంలో కలెక్టర్ పాల్గొని పలు సూచనలు చేశారు.


