నిందితుడి ఇంటికి నిప్పు | - | Sakshi
Sakshi News home page

నిందితుడి ఇంటికి నిప్పు

Apr 1 2026 7:18 AM | Updated on Apr 1 2026 7:18 AM

చెన్నారావుపేట : వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలం బోడమాణిక్యంతండాకు చెందిన బోడ స్రవంతి(28) తన ఇద్దరు కుమారులు కార్తీక్‌(12), కౌశిక్‌ (08)తో మంగళవారం హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కాగా, భర్తే.. భర్య, కుమారులను హత్య చేశాడని ఆరోపిస్తూ మృతురాలి బంధువులు ఆమె భర్త ప్రవీణ్‌ ఇంటికి నిప్పు పెట్టారు. ఇంటి చుట్టూ ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో తండావాసులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా వారు హుటాహుటినా ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయింది. ఇంట్లో సామగ్రి కాలిపోయింది.

నాడు ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు..

నేడు అదే ప్రేమను చిదిమేశాడు.!

చెన్నారావుపేట మండలం ఎల్లాయిగూడెం శివారు బోడమాణిక్యతండా జీపీకి చెందిన బోడ ప్రవీణ్‌ సమీపంలోని 16 చింతల తండాకు చెందిన స్రవంతికి ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. 14 సంవత్సరాల క్రితం పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. అనంతరం వారి దాంపత్య జీవితంలో ఇద్దరు కుమారులు కార్తీక్‌, కౌశిక్‌ జన్మించారు. ఈ క్రమంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు గొడవలు జరిగినా మళ్లీ ఒక్కటయ్యే వారు. కానీ రెండు సంవత్సరాల క్రితం ప్రవీణ్‌ మరో మహిళకు ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. ఈ విషయం స్రవంతికి తెలిసింది. దీంతో దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రవీణ్‌ వేధింపులు అధికమవడంతో త ట్టుకోలేక స్రవంతి ఆరు నెలల క్రితం తనపిల్లలను తీసుకుని వచ్చి తల్లిగారి ఇంటి వద్ద 16 చింతల తండాలో ఉంటుంది. ఎన్నిసార్లు చెప్పినా ప్రవీణ్‌ తీరు మారడం లేదని తల్లిదండ్రుల వద్ద వాపోయేది. అయితే చివరి అవకాశంగా ఒక్కసారి చూడమని తల్లిదండ్రులు సోమవారం నర్సంపేటలో పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. ఇక నుంచి సక్రమంగానే ఉంటానని నమ్మబలికిన ప్రవీణ్‌.. భార్యాపిల్లలను తీసుకుని హైదరాబాద్‌ వెళ్లాడు. అక్కడికి వెళ్లిన తర్వాత దంపతుల మధ్య ఏమి జరిగిందో తెలియదు కానీ 24 గంటలు గడవక ముందే ముక్కుపచ్చలారని ఇద్దరు పిల్లలతో కలిసి స్రవంతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనతో కుటుంబంతోపాటు తండాలో తీవ్ర విషాదం నెలకొంది.

ప్రవీణే హత్య చేసి ఆత్మహత్యగా

చిత్రీకరిస్తున్నాడు..

తమ కూతురు స్రవంతి, ఇద్దరు పిల్లలు కార్తీక్‌, కౌశిక్‌ను తమ అల్లుడు ప్రవీణే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని మృతురాలి తల్లిదండ్రులు భద్రి, భిక్యా ఆరోపించారు. ప్రవీణ్‌ రెండు సంవత్సరాల క్రితం మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, గతంలో గొడవలు జరిగా యని తెలిపారు. ఆరు నెలలుగా స్రవంతి,ప్రవీణ్‌ మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని, అతను స్రవంతిని వేధిస్తున్నాడని, తన ప్రేమకు ఇతర సంబంధాలకు అడ్డుగా ఉన్నారనే నెపంతో భార్యాపిల్లలను హత్య చేశాడని ఆరోపించారు. దీనిపై అధికారులు స్పందించి ప్రవీణ్‌ను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్‌ చేశారు.

హైదరాబాద్‌లో తల్లికుమారుల

అనుమానాస్పద మృతి

బోడమాణిక్యంతండాలోని భర్త ఇంటికి నిప్పు పెట్టిన మృతురాలి బంధువులు

భర్తే హత్య చేశాడని ఆరోపణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement