హన్మకొండ: విద్యుత్ స్తంభం ఎక్కుతూ కింద పడి అన్‌మ్యాన్డ్‌డిస్ట్రిబ్యూషన్ వర్కర్ పున్నం చందర్ మృతిచెందిన సంఘటన ఉద్రిక్తతకు దారి తీసింది. టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్ వరంగల్ నగరంలోని యాదవనగర్ సెక్షన్‌లో అన్‌మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్ గాదె పున్నం చందర్ విధుల్లో భాగంగా సోమవారం విద్యుత్ స్తంఽభాన్ని నిచ్చెన పై నుంచి ఎక్కుతూ కిందపడ్డాడు. తలకు బలమైన గాయం కావడంతో వెంటనే స్థానిక ఓ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందగా అంబులెన్స్‌లో మృతదేహంతో హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం వద్దకు చేరుకుని ధర్నా, రాస్తారోకో చేశారు. కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. మృతుడి భార్య శ్వేతకు ఆర్టిజన్‌గాన్ ఉద్యోగ అవకాశం కల్పించాలని, నష్టపరిహారం ఇప్పించి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎన్పీడీసీఎల్ సీజీఎం రాజు చౌహాన్, హనుమకొండ ఎస్‌ఈ పి.మధుసూదన్ రావు, విజిలెన్స్ ఆఫీసర్ బోనాల కిషన్, ఇతర అధికారులు చేరుకుని పున్నం చందర్ చనిపోవడం బాధాకరమని, మృతుడి కుటుంబానికి అండగా ఉంటామని న్యాయం చేస్తామని చెప్పారు. సీఎండీ వచ్చి స్పష్టమైన హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని తేల్చిచెప్పారు. ధర్నా విరమించకపోవడంతో ప్రతినిధుల బృందాన్ని హెచ్‌ఆర్‌డీ డైరెక్టర్ సి.ప్రభాకర్ వద్దకు చర్చలకు తీసుకెళ్లారు. డైరెక్టర్‌లు సి.ప్రభాకర్, వి.మోహన్‌రావు, వి.తిరుపతి రెడ్డి స్పష్టమైన హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఈ విషయమై టీజీ ఎన్పీడీసీఎల్ చీఫ్ ఇంజనీర్ రాజు చౌహాన్ మాట్లాడుతూ మృతుడి కుటుంబానికి సంస్థ పరంగా రూ.17 లక్షల ప్రమాద బీమా, ఎక్స్‌గ్రేషియా రూ.5 లక్షలు మొత్తం రూ.22 లక్షలు అందజేస్తామని వివరించారు. ఈ ఘటనపై పూర్తి దర్యాపు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు
విద్యుత్ స్తంభం ఎక్కుతూ కింద పడిన పున్నం చందర్
మృతదేహంతో టీజీ ఎన్పీడీసీఎల్
కార్యాలయం ఎదుట ధర్నా


