నయీంనగర్: అకస్మాత్తుగా వచ్చే తీవ్ర తలనొప్పిని సాధారణంగా తీసుకోవద్దని, ఇది కొన్ని సందర్భాల్లో అత్యంత ప్రమాదకర బ్రెయిన్ అన్యూరిజం కావొచ్చని హైదరాబాద్ మలక్‌పేట్ యశోద ఆస్పత్రి న్యూరో సర్జన్లు జయానంద్ సుధీర్, వంశీరెడ్డి తెలిపారు. మలక్‌పేట్ యశోద ఆస్పత్రి వైద్య బృందం సకాలంలో అత్యవసర ఓపెన్ బ్రెయిన్ శస్త్రచికి త్స చేసి రోగి ప్రాణం కాపాడారు. ఈ మేరకు మంగళవారం హనుమకొండలోని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. వరంగల్‌కు చెందిన ఓ వ్యక్తి తీవ్ర తలనొప్పితో డిసెంబర్ 5న ఆస్పత్రికి వచ్చాడు. దీంతో వైద్య సిబ్బంది సిటి స్కాన్ పరీక్ష నిర్వహించగా అందులో మెదడులో రక్తస్రావం ఉన్నట్లు తేలింది. మరికొన్ని పరీక్షల్లో మెదడులోని రక్తనాళంలో పెద్ద బ్రెయిన్ అన్యూరిజం ఉన్నట్లు గుర్తించారు. ఇది అత్యంత ప్రాణాపాయకర పరిస్థితి. అన్యూరిజం నిర్మాణం అత్యంత క్లిష్టంగా ఉండడంతో కోయిలింగ్, స్టంట్ చికిత్సలు సురక్షితంగా చేయడం సాధ్యం కాలేదు. అవి మెదడుకు రక్తప్రవాహాన్ని ఆపే ప్రమాదం ఉండడంతో అత్యవసరంగా ఓపెన్ బ్రెయిన్ శస్త్రచికిత్స (మైక్రో సర్జికల్ క్లిప్పింగ్) నిర్వహించారు. క్లిష్టమైన బ్రెయిన్ అన్యూరిజం కేసులకు కూడా విజయవంతంగా చికిత్స చేస్తున్నామని వారు తెలిపారు. సమావేశంలో మేనేజర్ ఎ.వాసుకిరణ్ రెడ్డి, గంగయ్య పాల్గొన్నారు.
యశోద ఆస్పత్రి న్యూరోసర్జన్లు
జయానంద్ సుధీర్, వంశీరెడ్డి


