గ్రేటర్ వరంగల్ గ్రీవెన్స్‌కు 70 వినతులు
వరంగల్ అర్బన్: నగర పరిధిలో అనధికారిక భవన నిర్మాణాలు, ఆక్రమణలపై ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. సోమవారం గ్రేటర్ వరంగల్ గ్రీవెన్స్‌కు మొత్తం 70 ఫిర్యాదులు అందగా.. 34 ఫిర్యాదులు టౌన్ ప్లానింగ్ సెక్షన్‌కు రావడం గమనార్హం. ఇంజినీరింగ్ విభాగానికి 13, పన్నుల సెక్షన్‌కు 15, హెల్త్, శానిటేషన్‌కు 2, తాగునీటి సరఫరా కోసం 6తోపాటు వ్యక్తిగత ఫిర్యాదులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. బల్దియా అడిషనల్ చంద్రశేఖర్, ఇన్‌చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్.. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, పరిష్కారానికి ఆయా విభాగాల అధికారులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో వెటర్నరీ వైద్యుడు గోపాల్ రావు, శానిటరీ సూపర్ వైజర్ భాస్కర్, ఏఈలు పాల్గొన్నారు.
గ్రీవెన్స్ ఫిర్యాదులు ఇలా..
● సీకేఎం కాలేజీ గ్రౌండ్‌లో సింథెటిక్ ట్రాక్ ఏర్పాటు చేయాలని, వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు విన్నవించారు.
● కేంద్ర సాయుధ మాజీ పోలీస్ బలగాల ఇళ్లకు పన్ను మినహా యింపు ఇవ్వాలని వెల్పేర్ అసోసియేషన్ అధ్యక్షుడు టి.ప్రభాకర్ వినతి పత్రాన్ని సమర్పించారు.
● కుమార్‌పల్లిలోని ఇంటి నంబరు 4–8–40 అదనపు నల్లా కనెక్షన్ బిల్లులను రద్దు చేయాలని కౌసర్ ఫాతిమ కోరారు.
● వరంగల్ 36వ డివిజన్ చింతల్ హరిజనవాడ ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింద ప్రమాదకరంగా మారిన డ్రెయినేజీ గుంతను పూడ్చాలని ఎస్.రాజశేఖర్ ఫిర్యాదు అందజేశారు.
● వరంగల్ 2వ డివిజన్ రెడ్డిపురం రోడ్డు మైత్రి నగర్‌లో తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని పైపులైన్లు వేయాలని కాలనీవాసులు కోరారు.
● 14వ డివిజన్ బాలాజీ నగర్ ఇందిరమ్మ కాలనీలో సీసీ రోడ్డు, డ్రెయినేజీ నిర్మించాలని సేవా సంఘ ప్రతినిధులు విన్నవించారు.
● వరంగల్ కొత్తవాడ భక్త మార్కండేయ దేవాలయానికి సమీపంలో సీసీ రోడ్డును నిర్మించాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు.
● 15వ డివిజన్ గొర్రెకుంట పోతరాజుపల్లిలోని శ్మశాన వాటికల్లో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని లైట్లు వెలిగేలా చర్యలు చేపట్టాలని స్థానికులు ఫిర్యాదు చేశారు.


