జర్నీ.. జరభద్రం! | - | Sakshi
Sakshi News home page

జర్నీ.. జరభద్రం!

Mar 30 2026 7:16 AM | Updated on Mar 30 2026 7:16 AM

విలువైన వస్తువులు తీసుకెళ్లొద్దు

ఏటీఎం కార్డులు తీసుకెళ్లడం ఉత్తమం

ఖిలా వరంగల్‌ : వేపవి వచ్చిందంటే ప్రయాణాలు సాధారణం.. పిల్లలకు సెలవులు ఇవ్వడంతో బంధువులు, పర్యాటక ప్రాంతాల, దైవ దర్శనాలకు వెళ్లేందుకు చాలా మంది సిద్ధమవుతారు. దీనికి నెల ముందు నుంచే ప్రణాళిక రూపొందించుకుంటారు. ఈ క్రమంలో ప్రయాణంలో లగేజీ పా త్ర కీలకం. ఒక్కోసారి విలువైన వస్తువులు తీసుకెళ్లక తప్పదు. ఈ సమయంలో ఏమాత్రం ఎమరుపాటుగా ఉన్నా ఇబ్బందులు తప్పవు. విలువైన వస్తువులు మాయమవడమే గాకుండా జర్నీ మొత్తం ఇబ్బందికరంగా మారుతుంది. ఈ నేపఽథ్యంలో వేసవిలో ప్రయాణికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర అంశాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.

సరి చూసుకోవాలి..

వేసవిలో కనీసం 4, 6,10 రోజుల టూర్‌ జర్నీ ఉండడం సహజం. ప్రయాణించే ముందు వారం రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్దేశించుకోవాలి. దుస్తులు నుంచి మొదలు.. విలువైన వస్తువుల వరకు వివరాల లిస్టును తయారు చేసుకోవాలి. ఇంటి నుంచి బయలుదేరేందుకు సిద్ధమవుతున్న రెండు మూడు గంటల ముందు వాటిని సరి చూసుకోవాలి.

హడావుడి వద్దు..

హడావుడి ప్రయాణం మంచిది కాదు. రైలు బయలు దేరడానికి అరగంట ముందుగా స్టేషన్‌కు చేరుకోవడం మంచిది. ట్రాఫిక్‌ రద్దీగా ఉంటే .. ఇంకా ముందుగా వెళ్లడం ఉత్తమం. స్టేషన్‌కు ఆటోలు, ఇతర ప్రైవేట్‌ వాహనాల్లో వెళ్లేటప్పుడు ఏమరుపాటు వద్దు. ఎందుకంటే అందులో లగేజీ మరిచిపోవడానికి ఆస్కారం ఉంటుంది. పక్కన కూర్చునే వారిని కూడా పట్టించుకోవడం మంచిది. ప్రయాణిస్తున్నప్పుడు బ్యాగులు తెరవడం.. వాటిని తరుచూ మూయడం మంచిది కాదు, ఎందుకంటే వాటిపై మరొకరు కన్నేసి ఉంటారు. వాహనాలు దిగే ముందు వెంట తెచ్చుకున్న వస్తువులు ఉన్నాయో లేదో సరిచూసుకోవడం మరవొద్దు.

చూడాల్సిన ప్రదేశాలు నిర్దేశించుకోవాలి..

ప్రయాణంలో ముందుగానే చూడాలనుకున్న ప్రదేశాలు నిర్దేశించుకుని బయలుదేరితే విలువైన కాలాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ప్రణాళిక లేకుండా వెళ్తే మాత్రం కోరి కష్టాలు తెచ్చకున్నట్లే. వేసవిలో సాధ్యవంతమైన వరకు పలుచటి దుప్పటి, దువ్వెనె, అద్దం, సబ్బు, పేస్ట్‌ , ఇతర వస్తువులు వెంట తీసుకెళ్లాలి. టూర్‌లో హోటళ్లు, లాడ్జీలు లభ్యం కాకపోతే ఇవే మనకు ఎంతో సౌలభ్యం చేకూరుస్తాయి.

రైలులో లగేజీని జాగ్రత్తగా

భద్రపరుచుకోవాలి..

వేసవిలో చాలా మంది రైలులో ఏసీలో ప్రయాణించడానికి ఎక్కువ ఇష్టపడతారు. అయితే ఇందులో ప్రయాణించినప్పుడు లగేజీ జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. కోచ్‌లో ప్రత్యేక రైల్వే సిబ్బంది ఉన్నా.. కేవలం ప్రయాణించడానికి భరోసా ఇస్తారే తప్ప లగేజీకి వారి బాధ్యత ఉండదు. విలువైన వస్తువులు ఉన్న బ్యాగులను పక్కనే ఉంచుకోవాలి. ఏసీ కోచ్‌ల్లోనే దొంగలు పడే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలి.

రైలులో ప్రయాణికులు నిత్యం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఎన్నో రాష్ట్రాలకు చెందిన వారు రాకపోకలు సాగిస్తుంటారు. వారికి మన భాషతో సంబంధం ఉండదు. సహ ప్రయాణికులతో చెలిమి చేయడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు. అయితే వారిలో కూడా దొంగలు ఉంటారని మరువొద్దు. రైలు కిటికీల దగ్గర కూర్చోని సెల్‌ఫోన్‌లో లీ నం కావద్దు. మొబైల్‌, విలువైన ఆభరణాలు లాక్కెళ్లిపోతారు. ఇటీవల రెల్వే శాఖ లగేజీ దొంగల పాలవకుండా సీట్ల కింద గొలుసులు ఏర్పాటు చేసింది. దీనిని సద్వినియోగం చేసుకోవాలి. పిల్లలు విషయంలో జాగ్రత్త అవసరం. గాలి తగిలేందుకు తలుపులు, ఎమర్జెన్సీ కిటీకీలు వద్ద చేతులు పెట్టుతారు. ఇలా చేయడం సరికాదు. ఎందుకంటే ఒక్కొసారి అవే ప్రమాదాలకు కారణమవుతాయి. వేకువ జామున 2 నుంచి 6 గంటల వరకు కుటుంబ సభ్యుల్లో కనీసం ఒక్కరైనా మెలకువగా ఉండడం వల్ల ప్రయాణం క్షేమంగా ముగుస్తుంది.

లగేజీ అధికంగా ఉంటే ఎక్కువ దూరం ప్రయాణించడం కష్టం. మనిషికి కనీసం 10 కిలోల కన్నా తక్కువ బరువు కలిగిన లగేజీ ఉండేలా చూసుకోవాలి. ప్రయాణంలో ఎక్కువ శాతం తెలియని ప్రదేశాలుంటే నడక ఉంటుంది. అయితే ఇదే సమయంలో లగేజీ ఎక్కువగా ఉంటే వాటికి వెచ్చించే ఖర్చే అధికమవుతుంది. రైల్వే శాఖ ఏర్పాటు చేసిన ఆయా స్టేషన్లలో ప్రత్యేక కౌంటర్లలో గంటల చొప్పున లగేజీని భద్రపరుచుకోవచ్చు. అయితే ఇది సురక్షితం కాదనే విషయం గుర్తించాలి. క్యాంపుల్లో విలువైన వస్తువు లేవీ తీసుకెళ్లొద్దు. ఎందుకంటే అవి సురక్షితం కాదు. నగదుకు బదులు ఏటీఎం కార్డులు తీసుకెళ్లడం ఉత్తమం.

ప్రయాణంలో జాగ్రత్తలు పాటించాల్సిందే..

లేనిపక్షంలో ఇబ్బందులు తప్పవు

అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి

లగేజీ తగ్గించుకోవడం మంచిది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement