ఈసారి కూడా లోటేనా? | - | Sakshi
Sakshi News home page

ఈసారి కూడా లోటేనా?

Mar 30 2026 7:16 AM | Updated on Mar 30 2026 7:16 AM

కేయూ క్యాంపస్‌: కేయూ 2026–2027 ఆర్థిక సంవత్సరం అంచనాల బడ్టెట్‌ మొత్తం రూ. 396 కోట్లకుపైనే ఉంటుందని సమాచారం. కాకతీయ యూనివర్సిటీ 41వ అకడమిక్‌ సెనెట్‌ సమావేశం సోమవారం పరిపాలన భవనంలోని సెనెట్‌హాల్‌లో నిర్వహించనున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ ప్రతిపాదనలను ప్రవేశపెట్టనున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2025–2026లో రూ.428 కోట్లకుపైగా బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఈసారి రూ.27 కోట్లకు పైగా లోటు బడ్జెట్‌ను చూపెట్టే అవకాశాలున్నాయి తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో 165.47 కోట్ల గ్రాంట్‌ కేటాయించింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే సుమారు రూ.20 కోట్లకు పెంచింది. ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్‌ కేవలం టీచింగ్‌, నాన్‌టీచింగ్‌ రెగ్యులర్‌ ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలకు సరిపోతుంది. అలాగే, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు కూడా మరో రూ. 35.64 కోట్లు కేటాయించింది.

రిటైర్డ్‌ ఉద్యోగులకు బెనిఫిట్స్‌ ఆలస్యం..

కాకతీయ యూనివర్సిటీలో ఉద్యోగ విరమణ పొందిన వారికి ప్రభుత్వం బెనిఫిట్స్‌ నిధులు విడుదల చేయడం లేదు. అంతర్గత నిధులు ద్వారా మాత్రమే చెల్లింపులు చేయాల్సి రావడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రొఫెసర్ల ఉద్యోగ విరమణ వయస్సును 65 సంవత్సరాలు చేయడంతో ఇక ఇప్పట్లో ఉద్యోగ విరమణలు లేవు. నాన్‌టీచింగ్‌ ఉద్యోగులు ఉద్యోగ విరమణ పొందాక కూడా బెనిఫిట్స్‌ చెల్లింపుల్లో జాప్యం అవుతోంది.

రెగ్యులర్‌ అధ్యాపకుల కంటే పెన్షనర్లే ఎక్కువ..

ప్రస్తుతం కాకతీయ యూనివర్సిటీలో 77 మంది రెగ్యులర్‌ అధ్యాపకులు ఉన్నారు. 179 మంది కాంట్రాక్టు లెక్చరర్లు, 185 మంది పార్ట్‌టైం లెక్చరర్లు పనిచేస్తున్నారు. పెన్షనర్‌ అధ్యాపకులు 260 మంది, నాన్‌టీచింగ్‌ ఉద్యోగులు 382 వరకు ఉన్నారు. పెన్షనర్లు టీచింగ్‌, నాన్‌టీచింగ్‌ కలిపి 750 మందికిపైగానే ఉన్నారు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు 507 మంది వరకు ఉన్నారు.

మొక్కుబడిగా సమావేశం..

కేయూ అకడమిక్‌ సెనెట్‌ సమావేశం కొన్నేళ్లుగా మొక్కుబడిగానే కొనసాగుతోంది. పేరుకు అకడమిక్‌ సెనెట్‌ సమావేశం అని చెప్పి కేయూ అంచనాల బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. అకడమిక్‌ సెనెట్‌ సభ్యుల సంఖ్య తగ్గిపోయింది. రెండు దశాబ్దాల క్రితం ఏర్పాటుచేసిన సెనెట్‌ సభ్యుల్లో మళ్లీ ఇప్పటి వరకు నియమించలేదు. 200 మందికిపైగానే సభ్యులు ఉండాలి.. కానీ, 20 మంది వరకు మాత్రమే సభ్యులున్నారని తెలుస్తోంది. అకడమిక్‌ సెనెట్‌లో కేయూ వీసీ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. మాజీ వీసీలు, అన్ని విభాగాల డీన్‌లు, కేయూ పాలకమండలి సభ్యులు ఇందులో ఉంటారు.

అభివృద్ధికి రూ. 40 కోట్లు మాత్రమే..

కాకతీయ యూనివర్సిటీ అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్‌లో రూ.40 కోట్ల వరకు మాత్రమే కేటాయించింది. గతంలో కొన్నేళ్లుగా ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నా తర్వాత విడుదల చేయడం లేదనే ఆరోపణలున్నాయి. ఈసారి ఈనిధులనైనా విడుదల చేస్తుందా లేదా అనేది వేచి చూడాల్సి. రూసా, అంతర్గత నిధులతో కాకతీయ యూనివర్సిటీలో వివిధ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి.

బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న

ప్రొఫెసర్‌ సురేశ్‌లాల్‌..

కాకతీయ యూనివర్సిటీ 41వ అకడమిక్‌ సెనెట్‌ సమావేశంలో కేయూ పాలకమండలి సభ్యుడు బి.సురేశ్‌లాల్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. కేయూ వీసీ కె.ప్రతాప్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించనున్న సమావేశంలో 2024–2025 వార్షిక నివేదిక, కేయూ స్టాండింగ్‌ కమిటీ మినట్స్‌ ప్రవేశపెట్టనున్నారు. రిజిస్ట్రార్‌ వి.రామచంద్రం, సభ్యులు పాల్గొంటారు.

కేయూ అంచనాల

బడ్జెట్‌ రూ.396 కోట్లకుపైనే..

నేడు 41వ అకడమిక్‌ సెనెట్‌ సమావేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement