హన్మకొండ: ఆర్టీసీ జేబీఎం విద్యుత్ బస్సులో మంటల చెలరేగాయి. సిబ్బంది వెంటనే అప్రమత్తం కావడంతో భారీ ముప్పు తప్పింది. అధికారులు, సిబ్బంది వివరాల ప్రకారం.. టీజీఎస్ ఆర్టీసీ వరంగల్–2 డిపోలో 115 విద్యుత్ బస్సులున్నాయి. ఇందులో టీజీ 03 టీ 1260 నంబర్ ఎక్స్‌ప్రెస్ బస్సు హైదరాబాద్ నుంచి శనివారం అర్ధరాత్రి 12 గంటలకు డిపోనకు చేరుకుంది. తర్వాత బస్సుకు చార్జింగ్ పెట్టారు. చార్జింగ్ పూర్తయిన తర్వాత బస్సులోపలి భాగం శుభ్రం చేసి వాటర్ వాషింగ్ దగ్గరకు తీసుకెళ్లారు. అప్పటికే వేరే బస్సులను నీటితో శుభ్రం చేస్తుండడంతో వరుసలో పెట్టి డ్రైవర్ దిగి పక్కకు వెళ్లాడు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున 2.20 గంటలకు బ్యాటరీ నుంచి పొగలు వచ్చి మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే బస్సులో ఉండే అగ్నిమాపక సాధనాలు, నీరు చల్లుతూ మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది చేరుకుని ఫైర్ ఇంజన్‌తో మంటలు ఆర్పా రు. స్వల్ప వ్యవఽధిలోనే మంటలు అదుపులోకి రావడంతో బస్సు పూర్తిగా దగ్ధం కాలేదు. సీట్ల వరకు మంటలు వ్యాపిస్తే పక్కన ఉన్న ఇతర బస్సులకు మంటలు వ్యాపించి భారీ నష్టం జరిగేది. బస్సులో మొత్తం 12 బ్యాటరీలుంటాయని, ఇందులో 8వ నంబర్ బ్యాటరీ నుంచి మంటలు వచ్చాయి. సమాచారం అందుకున్న రీజినల్ మేనేజర్ దర్శనం విజయభాను, డిప్యూటీ ఆర్‌ఎంలు కేశరాజు భానుకిరణ్, మహేశ్, డిపో మేనేజర్ రవిచందర్ డిపోనకు చేరుకున్నారు. ఘటన వివరాలు తెలుసుకున్నారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఆర్పివేసిన అగ్నిమాపక సిబ్బంది
అప్రమత్తం కావడంతో తప్పిన పెనుముప్పు


