● గోవాలోని అతి ఎత్తయిన ‘సోన్సోగోర్’ పర్వతం అధిరోహణ
మరిపెడ రూరల్: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం భూక్యతండాకు చెందిన మౌంటైనర్ యశ్వంత్ మరో అరుదైన సాహసాన్ని విజయవంతం చేశాడు. ‘హర్ శిఖర్ పర్ తిరంగా’ జాతీయ మిషన్‌లో భాగంగా ‘గోవా’ రాష్ట్రంలోని 1,166 మీటర్ల ‘సోన్సోగోర్’ పర్వతాన్ని శనివారం అధిరోహించి మరో రికార్డు తన సొంతం చేసుకున్నాడు. జట్టు సభ్యులు గణబా గోవింద్ గాంకర్, దిలీప్ కిర్కర్, రాజు దోయిఫుడే, నాయుడు గావకర్, జాన్‌రిచ్ ఫెర్నాండెజ్, ఉజ్వల్, రెహాన్‌షేక్‌తో కలిసి గోవా సోన్సోగోర్ పర్వతాన్ని అధిరోహించాడు. గోవా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అలోక్‌కుమార్ ఐపీఎస్, గోవా ముఖ్య ప్రధాన అటవీ సంరక్షణ అధికారి కమల్ దత్త, ఉత్తర గోవా ఫారెస్ట్ డిప్యూటీ కన్జర్వేటర్ జిస్ వెర్కీ ఐఎఫ్‌ఎస్ సహకారంతో పూర్తి చేసినట్లు యశ్వంత్ తెలిపాడు. ఇప్పటికే అరుణాచల్‌ప్రదేశ్‌లోని గోరిచెన్, మణిపూర్‌లో మౌంట్‌ఐసో (2,994 మీటర్లు), మిజోరాంలోని ఫాంగ్‌పుయి (2,157 మీటర్లు), త్రిపురలోని బెట్లింగ్‌చిప్ (939 మీటర్లు), అసోంలోని తుమ్జాంగ్ (1,860 మీటర్లు), మేఘాలయలోని షిల్లాంగ్ (1,966మీటర్లు), రాజస్తాన్‌లోని గురుశిఖర్ (1,722 మీటర్లు), ఆంధ్రప్రదేశ్‌లోని అర్మకొండ (1,680 మీటర్లు) ఒడిశాలోని డియోమాలి (1,672 మీటర్లు), మణిపూర్ రాష్ట్రంలోని 2,994 మీటర్ల ‘ఇసో’ పర్వతారోహణం చేసినట్లు పేర్కొన్నాడు.


