అసహనం వ్యక్తం చేసిన కార్పొరేటర్
వరంగల్ అర్బన్: ఆస్తి, నీటి పన్నులు చెల్లించిన ఓ కార్పొరేటర్‌కు రెడ్ నోటీసు జారీ చేసి, గృహం సీజ్ చేస్తామని నోటీసు అంటించడంపై పన్నుల విభాగం సిబ్బంది తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వరంగల్ 28వ డివిజన్ కార్పొరేటర్ గందె కల్పన తన భవనాలకు సంబంధించిన ఆస్తి పన్ను, నీటి చార్జీలు రూ.2.20 లక్షల సొమ్ముతోపాటు రూ.25 వేల వడ్డీని ఈనెల 20న చెల్లించి రశీదు స్వీకరించారు. కానీ, బల్దియా పన్నుల విభాగం సిబ్బంది.. ఎవరు పన్నులు చెల్లించారు? ఎవరు చెల్లించలేదనే విషయాలను పరిగణనలోకి తీసుకోకుండా నోటీసులు అంటించడం వారి నిర్లక్ష్యాన్ని సూచిస్తోంది. పన్నులు చెల్లించినప్పటికీ తన నివాసానికి నోటీసు అంటించి.. తన పరువుకు భంగం కలిగించారని కార్పొరేటర్ గందె కల్పన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


