కాజీపేట అర్బన్: పరిశ్రమలకు నూతన ఆవిష్కరణలు, ఆలోచనలను అందజేసేందుకు ఇంక్యుబేషన్‌లా నిట్ వరంగల్ నిలుస్తుందని నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ అన్నారు. నిట్ వరంగల్‌లోని అంబేడ్కర్ లెర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో శుక్రవారం ఐఏఐసీ–26 (ఇండస్ట్రీ అకాడమీ ఇన్నోవేషన్ కాన్‌క్లేవ్)ను రీసెర్చ్ అండ్ ఇండస్ట్రీయల్ కన్సల్టెన్సీ, సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సౌజన్యంతో నిర్వహించారు. ఐఏఐసీ–26 సమావేశానికి ముఖ్య అతిథిగా నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాన్ని ప్రారంభించి మాట్లాడారు. నిట్ వరంగల్ ఇన్నోవేషన్ సెంటర్ వేదికగా నిలుస్తోందన్నారు. కాగా, ఐఏఐసీ–26 సమావేశంలో టెక్నాలజీ స్టాల్స్, ఇన్నోవేషన్, ఏఐ ఎగ్జిబిట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో ఫిలిప్స్ టౌన్సెండ్ అసోసియేషన్, ఎల్‌అండ్‌టీ అడ్వైజర్ వినాయక్ మరాఠే, ఏఎన్‌ఆర్‌ఎఫ్ సీఈఓ శివకుమార్, ఐఏఐసీ ప్రతినిధులు, నిట్ ప్రొఫెసర్లు తదితరులు పాల్గొన్నారు.
హన్మకొండ: భారత ప్రభుత్వ జల శక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి వీఎల్.కాంతారావును కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ కలిశారు. హనుమకొండ హోటల్ హరిత కాకతీయలో మర్యాద పూర్వకంగా కలుసుకుని మొక్క అందించారు. జిల్లాలో నీటి వనరుల అభివృద్ధి, నీటి సంరక్షణపై చర్చించారు.
కాజీపేట అర్బన్: కాజీపేట వంద ఫీట్ల రోడ్డులోని వరంగల్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో శనివారం 176 స్లాట్ రిజిస్ట్రేషన్లను రాత్రి 8.30 నిమిషాల వరకు సబ్ రిజిస్ట్రార్లు పూర్తి చేయనున్నారు. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న తరుణంలో శనివారం, సోమవారం, మంగళవారం మూడురోజుల పాటు రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయాన్ని పెంచేందుకు సబ్ రిజిస్ట్రార్ల పని వేళలు మారుస్తూ 11 గంటల పాటు రిజిస్ట్రేషన్లు కొనసాగేలా మార్పు చేసింది. ఇప్పటి వరకు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రిజిస్ట్రేషన్ కార్యాలయాల పని వేళలను మారుస్తూ ఉదయం 9:30 నిమిషాల నుంచి రాత్రి 8.30 నిమిషాల వరకు నిర్ణయించింది. ఇందులో భాగంగా.. ప్రతీ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి 48 స్లాట్ బుకింగ్స్ ఉండగా.. వరంగల్ ఆర్‌ఓలో ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు ఉండడం ద్వారా 96 స్లాట్స్ అవకాశం ఉండేది. ప్రస్తుతం మార్చిన స్లాట్స్‌లో భాగంగా 176 స్లాట్లకు అవకాశం కల్పించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇదే తరహా పని వేళలు, స్లాట్ బుకింగ్‌లు కొనసాగనున్నాయి.


