ముగిసిన వసంత నవరాత్రోత్సవాలు
హన్మకొండ కల్చరల్ : వరంగల్ నగరంలోని శ్రీభద్రకాళి దేవాలయంలో జరుగుతున్న వసంత నవరాత్రోత్సవాలు శుక్రవారం ముగిశాయి. చివరిరోజు అమ్మవారికి గులాబీ పూలతో పుష్పార్చన నిర్వహించారు. ప్రధానార్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో అర్చకులు ఉదయం అమ్మవారికి నిత్యాహ్నికం నిర్వహించారు. అనంతరం అర్చకులు, వేదపాఠశాల విద్యార్థులు గులాబీలకు సంప్రోక్షణ జరిపి అమ్మవారికి లక్ష పుష్పార్చన నిర్వహించారు. పుష్పార్చనలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు. మండలి సభ్యులు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు ఎండకు ఇబ్బంది పడకుండా శాశ్వత ప్రాతిపదికన జర్మన్ పెండల్స్ టెంట్లు వేయించాలని అందుకు అయ్యే ఖర్చు రూ.10 లక్షలు విరాళంగా ఇస్తానని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. దీంతో ఆలయ ధర్మకర్తలు పది రోజుల్లో పనిపూర్తి చేయిస్తామని హామీ ఇవ్వడంతో టెంట్ల ఏర్పాటు పనులను శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. వరంగల్‌కు చెందిన బాకరాజు చంద్రశేఖర్‌రావు, రాజశ్రీ దంపతులు భక్తులు స్వయంగా కుంకుమార్చన జరుపుకోవడానికి వీలుగా పంచలోహలతో తయారుచేసిన అమ్మవారి పాదుకలను ఆలయానికి సమర్పించారు. రాత్రి సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహించారు.


