హన్మకొండ కల్చరల్ : వేయిస్తంభాల దేవాలయంలో నిర్వహిస్తున్న శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణ నవరాత్రి ఉత్సవాలు బుధవారం ఏడో రోజుకు చేరాయి. ఇందులో భాగంగా సీతారాములకు లక్ష తులసి అర్చన నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు రుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం, సీతారామచంద్రస్వామి ఉత్సవ మూర్తులకు విశ్వక్సేనారాధన, పంచసూక్తములతో చతుర్వేద మూలమంత్రంగా అర్చనలు చేశారు. కమ్మ సంఘం రాష్ట్ర నాయకుడు చిన్న కోనయ్య–ధనలక్ష్మి దంపతుల సౌజన్యంతో తూర్పుగోదావరి నుంచి ప్రత్యేకంగా తెప్పించిన తులసి దళాలతో సీతారాముల ఉత్సవ విగ్రహాలకు లక్ష తులసి అర్చన చేశారు. యాగశాలలో నవగ్రహ రుద్రహోమ సహిత మహాసుదర్శన హోమం నిర్వహించారు. ఈఓ అనిల్‌కుమార్ పర్యవేక్షించారు.
హన్మకొండ : ప్రయాణికుల సలహాలు, సూచనల మేరకు మెరుగైన సేవలు అందించేందుకు డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ వరంగల్–2 డిపో మేనేజర్ ఎం.రవిచందర్ తెలిపారు. ఈ నెల 26న(గురువారం) మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు హనుమకొండలోని వరంగల్–2 డిపో నుంచి డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో వివరించారు. ములుగు, ఏటూరునాగారం ప్రాంత ప్రయాణికులు 99595 58556 నంబర్‌కు ఫోన్ చేసి సలహాలు, సూచనలు తెలపాలని కోరారు.
కాజీపేట రూరల్ : ఆటో డ్రైవర్లు ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ సూచించారు. కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కాజీపేట రైల్వే కమ్యూనిటీ హాల్‌లో బుధవారం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అరైవ్–అలైవ్ కార్యక్రమంలో భాగంగా ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు సీపీ సన్‌ప్రీత్‌సింగ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని, అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ వల్ల జరిగే ప్రమాదాలను నివారించాలని సూచించారు. డ్రైవింగ్‌లో మొబైల్ ఫోన్ వినియోగం, మద్యం తాగి వాహనం నడపడం వంటి చర్యలు ప్రమాదాలకు దారితీస్తాయని ఆయన హెచ్చరించారు. అనంతరం ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తామని ప్రమాణం చేశారు. సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, ట్రాఫిక్ అదనపు డీసీపీ రాయల ప్రభాకర్‌రావు, ఏసీపీలు సత్యనారాయణ, పింగిళి ప్రశాంత్‌రెడ్డి, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్లు పి.వెంకన్న, సీతారాం రెడ్డి, సుజాత, కాజీపేట ఇన్‌స్పెక్టర్ సుధాకర్ రెడ్డి, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
విద్యారణ్యపురి : రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల చెల్లింపులో హైకోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయమని రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ బకాయిల సాధన కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ ధర్మేంద్ర పేర్కొన్నారు. బుధవారం హనుమకొండలోని పీఆర్‌టీయూ భవనంలో నిర్వహించిన కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్స్ రాకపోవడంతో కొంతమంది రిటైర్డ్ ఉద్యోగులు కోర్టును ఆశ్రయించగా తీర్పునిచ్చిందన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి భోగేశ్వర్ మాట్లాడుతూ హైకోర్టు తీర్పు ఆదేశం మాత్రమే కాదని, విశ్రాంత ఉద్యోగుల పాలిట ఆశల ఆయుధమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కందుకూరి దేవదాసు, అబ్దుల్‌గఫార్, దామోదర్, ఇంద్రసేనారెడ్డి, కుమారస్వామి, సారయ్య, విశ్వనాథం పాల్గొన్నారు.


