వరంగల్ కలెక్టర్ సత్యశారద
కాశిబుగ్గ : రోగుల వైద్యసేవలపై ప్రత్యేక దృష్టి సారించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. బుధవారం సీకేఎం ప్రసూతి ఆస్పత్రిని తనిఖీ చేశారు. వివిధ వార్డులను సందర్శించి రోగులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల పెట్టెను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆస్పత్రిలో అడ్మిట్ అయిన రోగులకు అందిస్తున్న ఆహారం విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని, పౌష్టికాహారం సమయానికి అందేలా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆర్డీఓ ఉమారాణి, జిల్లా వెనుకబడిన వర్గాల అభివృద్ధి అధికారి పుష్పలత, సీకేఎం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీదేవి, ఎంజీఎం సూపరింటెండెంట్ హరిశ్చంద్రారెడ్డి, వైద్యులు పాల్గొన్నారు.
‘ఉపాధి’ పనులను పూర్తి చేయాలి
న్యూశాయంపేట : ఉపాధి హామీ పథకం పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ హాల్‌లో పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. పనుల పూర్తి వివరాలను సమగ్రంగా సిద్ధం చేసి రాష్ట్ర కమిషనర్ కార్యాలయానికి పంపించాలని సూచించారు. జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, సహాయ ప్రా జెక్టు డైరెక్టర్ శ్రీవాణి, పీఆర్ ఇంజనీర్ ఇజ్జగిరి, డీపీ ఓ కల్పన, ఎంపీడీఓలు, అధికారులు పాల్గొన్నారు.
రైతులతో ఆర్బిట్రేషన్
సంగెం మండలంలోని సంగెం, చింతలపల్లి గ్రామాలకు చెందిన 163 గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులతో కలెక్టర్ సత్యశారద ఆర్బిట్రేషన్ నిర్వహించారు. రైతుల సమస్యలు, అభ్యంతరాలను కలెక్టర్ స్వయంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.


