హన్మకొండ అర్బన్ : గతేడాది పార్లమెంట్‌లో ఆమోదించిన పెన్షన్ వాలిడేషన్ చట్టంతో అన్యాయం జరుగుతోందని, వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ అధ్యక్షుడు జి.వీరస్వామి, ఉపాధ్యక్షుడు టి.పురుషోత్తం డిమాండ్ చేశారు. బుధవారం సంఘం ఆధ్వర్యంలో పెన్షన్ వాలిడేషన్ యాక్ట్‌కు వ్యతిరేకంగా నల్లబ్యాడ్జిలు ధరించి నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇప్పటివరకు ప్రభుత్వ పెన్షనర్లు పొందుతున్న ప్రయోజనాలన్ని కూడా 2026 జనవరి 1నుంచి ఈ చట్టం ప్రకారం వర్తించవన్నారు. అలాంటి చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం సరికాదని విమర్శించారు. వెంటనే ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ చట్టం అమలుతో 2025 డిసెంబర్ 31 వరకు పెన్షనర్లు పొందుతున్న సదుపాయాలు భవిష్యత్‌లో ఉండవన్నారు. అలాగే 2024 మార్చి నుంచి 2026 ఫిబ్రవరి వరకు రిటైర్డ్ అయిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన జీపీఎఫ్, గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, పీఆర్‌సీ–2020 బకాయిలన్నింటిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం పెన్షన్ వాలిడేషన్ యాక్ట్ సంబంధించిన జీఓ కాపీని చించివేసి హనుమకొండ కలెక్టర్ ద్వారా ప్రధానమంత్రికి అందజేయాలని వినతిపత్రం అందజేశారు. హనుమకొండ జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి, ఎస్‌టీఓ జనరల్ సెక్రటరీ కందుకూరి దేవదాసు, ప్రధాన కార్యదర్శి సమ్మారెడ్డి, కమిటీ సభ్యులు ప్రకాశ్, రత్నాకర్, సూర్య ప్రకాశ్, సింగారెడ్డి, సత్యనారాయణ, రమేశ్, జ్యోతిరమణి, రాధ, సుభాషిణి, రాజ కొమురమ్మ, ప్రభాకర్‌రెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి, ఆగయ్య, భోగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.


