అర్జీలను త్వరగా పరిష్కరించాలి
ప్రజావాణిలో పాల్గొన్న వరంగల్ కలెక్టర్ సత్యశారద, అధికారులు
విద్యార్థులకు ప్రశ్నలు వేసి జవాబును రాబడుతున్న కలెక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: ప్రజావాణిలో ప్రజలు సమర్పించిన అర్జీలను అధికారులు త్వరగా పరిష్కరించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. గ్రీవెన్స్‌లో భాగంగా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా దరఖాస్తుదారుల సమక్షంలోనే సంబంధిత అధికారులతో కలెక్టర్ చర్చించారు. ప్రజల సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని సూచించారు. ప్రజావాణికి 150 దరఖాస్తులు రాగా, అందులో రెవెన్యూశాఖకు సంబంధించినవి 56, జీడబ్ల్యూఎంసీ 38, ఇతర శాఖలకు సంబంధించినవి 56 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. ‘మేము వరంగల్ నగరంలోని కాశిబుగ్గ వివేకానంద కాలనీలో ముప్పై ఏళ్లుగా నివాసముంటున్నాం. మా కాలనీలో రోడ్డు వేశారు కానీ డ్రెయినేజీలు నిర్మించలేదు. దాంతో రోడ్లపై మురుగు పారుతోంది. మురుగునీటి కాల్వలు నిర్మించాలని పలుమార్లు కలెక్టర్, కమిషనర్‌కు విన్నవించినా ఫలితం లేదు’ అని వరంగల్ కాశిబుగ్గకు చెందిన అమ్జద్ పాషా విన్నవించారు.
‘సర్’పై సమీక్ష
ప్రజావాణి అనంతరం జిల్లాలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) మ్యాపింగ్ ప్రక్రియపై తహసీల్దారులతో కలెక్టర్ సత్యశారద సమీక్ష సమావేశం నిర్వహించారు. భూ సంబంధిత రికార్డుల కచ్చితత్వం కోసం చేపట్టిన సర్వే కార్యక్రమాన్ని వేగవంతం చేసి ఎలాంటి పొరపాట్లు లేకుండా గడువులోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్‌ఓ విజయలక్ష్మి,, ఆర్డీఓలు సుమ, ఉమారాణి, డీఎంహెచ్‌ఓ డాక్టర్ సాంబశివరావు, హౌసింగ్ పీడీ శ్రీవాణిలతో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
విద్యార్థులు కష్టపడి చదవాలి
ఖిలా వరంగల్: లక్ష్యాన్ని ఎంచుకొని కష్టపడి చదివి ఉన్నత స్థానానికి చేరుకోవాలని పదో తరగతి విద్యార్థులకు వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. ఖిలా వరంగల్ మధ్యకోటలోని ఆరెల్లి బుచ్చ య్య ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సోమవారం సాయంత్రం కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా బోధన తీరు, ప్రత్యేక తరగతులు, అందిస్తున్న స్నాక్స్‌ను పరిశీలించారు. అనంతరం పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలపై అవగాహన కల్పించారు. ప్రణాళికాబద్ధంగా చదివి ఉత్త మ ఫలితాలు సాధించాలన్నారు. సమయపాలన పాటిస్తూ వందశాతం ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. పరీక్ష సమయంలో ఎదురయ్యే భయాందోళనలను తొలగించేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. డీఈఓ రంగయ్య నాయుడు, ఎంఈఓ ప్రసాద్, తహసీల్దార్ మహ్మద్ ఇక్బాల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద
అర్జీలను త్వరగా పరిష్కరించాలి


