కేయూ ‘లా’ సెమిస్టర్ పరీక్షలు వాయిదా
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీపరిధిలో ఈనెల 17నుంచి జరగాల్సిన ఎల్‌ఎల్‌బీ మూడేళ్ల మొదటి, మూడవ సెమిస్టర్ పరీక్షలు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ మొదటి, మూడవ, ఐదవ, ఏడవ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి ఆసింఇక్బాల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మళ్లీ పరీక్షలు నిర్వహించే తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు.
గంజాయి రవాణదారులకు ఇరవై ఏళ్ల జైలు
వరంగల్ లీగల్ : గంజాయి రవాణ చేసిన ఘటనలో నేరం రుజువుకావడంతో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఇద్దరు వ్యక్తులకు 20 సంవత్సరాల జైలు శిక్షతోపాటు రూ.లక్ష చొప్పున జరిమానా విధిస్తూ హనుమకొండ జిల్లా మొదటి అదనపు కోర్టు జడ్జి బి.అపర్ణాదేవి గురువారం తీర్పు వెలువరించారు. అక్టోబర్ 2023, 16న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎల్కతుర్తి మండల పెంచికలపేట వద్ద పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో అనుమానాస్పదంగా ఉన్న ఓ వాహనానం నుంచి ఇద్దరు వ్యక్తులు పారిపోవడానికి యత్నించగా పోలీసులు పట్టుకున్నారు. అనంతరం వాహనాన్ని తనిఖీ చేయగా సరుకు లభించడంతో స్వాధీనం చేసుకుని మహారాష్ట్రకు చెందిన కె.రాజవర్మ, మధ్యప్రదేశ్‌కు చెందిన నాందేవ్ సాహెబ్ రావు పటేల్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. కేసు విచారణలో నేరం రుజువు కావడంతో నేరస్తులకు 20 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.లక్ష చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.
10.5 కేజీల గంజాయి స్వాధీనం..
డోర్నకల్ : రైల్వే స్టేషన్ సమీపంలో పోలీసులు 10.5 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. డోర్నకల్ సీఐ చంద్రమౌళి కథనం ప్రకారం.. ఎస్సై ఎస్‌కె ఖాదర్‌పాషా ఆధ్వర్యంలో గురువారం రైల్వే స్టేషన్ సమీపంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో ఓ వ్యక్తి, మహిళ.. స్టేషన్ నుంచి బ్యాగుతో వస్తూ పోలీసులను చూసి పారిపోవడానికి యత్నించారు. పట్టుకుని తనిఖీ చేయగా బ్యాగులో 10.5 కేజీల గంజాయి లభించింది. దీంతో రూ.5,25,500 విలువైన సరుకు స్వాధీనం చేసుకుని మహారాష్ట్రకు చెందిన రాజ్‌కన్య విలాస్ మొహతే, వసంత శామ్రావుజీ గోడేను అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు.


