కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్
ఎంజీఎం: ఎంజీఎం ఆస్పత్రికి నిత్యం వివిధ ప్రాంతాల నుంచి 2 వేల నుంచి 2,500 మంది రోగులు వస్తుంటారు. రద్దీకి అనుగుణంగా కౌంటర్లు పెంచాలని గతంలో ఈ ఆస్పత్రిని సందర్శించిన సమయంలో వరంగల్ కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. ఓపీ చిట్టీలు అందించే కంప్యూటర్ కౌంటర్లను, చికిత్సలు అందించే స్థలం నుంచి వృద్ధుల ఓపీ విభాగం వద్దకు తరలించాలని ఆదేశించారు. అనంతరం కంప్యూటర్ ద్వారా ఓపీ ఇచ్చే స్లిప్ గదిని ఔషధ పంపిణీకి అనుగుణంగా రెండు కౌంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు మరో నాలుగు కౌంటర్లను నూతనంగా ఏర్పాటు చేశారు. అప్పటికీ కొనసాగుతున్న నాలుగు కౌంటర్లకు అదనంగా మరో ఆరు చేరడంతో ఆ సంఖ్య పదికి పెరిగింది. నూతన కౌంటర్లను స్వయంగా మంత్రి సురేఖతో కలిసి కలెక్టర్ సత్యశారద స్వయంగా ప్రారంభించారు. ఈ సేవలు కాస్తా మున్నాళ్ల ముచ్చటగానే మారాయి. ప్రస్తుతం ఈ కౌంటర్ల సంఖ్యను ఎంజీఎం అధికారులు ఆరుకు కుదించారు. ‘2 వేల మంది ఓపీ రోగులకు ఆరు కౌంటర్‌లు చాలు, పది అవసరం లేదు’ అనేలా అధికారులు వ్యవహరిస్తుండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈక్రమంలో బుధవారం ఆస్పత్రిలో 1, 2, 3వ నంబర్ కౌంటర్లు మూసివేసి ఉండగా, తెరిచి ఉన్న 10వ కౌంటర్, 4వ కౌంటర్‌లో సిబ్బంది లేకపోవడం గమనార్హం.
మూడు గంటలు.. ఒక్కో కౌంటర్‌లో 400 మందికి జౌషధాలు
ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఓపీ కొనసాగిస్తారు. 9.15 నిమిషాల తర్వాత ఓపీలో చికిత్స పొందిన రోగులకు మందులిస్తారు. 12 గంటలకు ఓపీ మూసేసినా 12.30 గంటల వరకు మందుల పంపిణీ జరుగుతుంది. సుమారు 3 గంటల్లో ఆరు కౌంటర్ల ద్వారా 2,500 మందికి మందులు పంపిణీ చేయడం సాధ్యం కాదనే విషయాన్ని కలెక్టర్ గుర్తించారు. కానీ ఎంజీఎం పరిపాలనాధికారులు గుర్తించకపోవడం గమనార్హం.
మూసి ఉన్న 1, 2 నంబర్ కౌంటర్,
తెరిచి ఉన్నా కౌంటర్‌లో లేని ఫార్మసిస్ట్
పది నుంచి ఆరు కౌంటర్లకు కుదించిన ఎంజీఎం సిబ్బంది
ఔషధాల కోసం లైన్లో రోగుల తిప్పలు
కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్


