ప్రభుత్వరంగ సంస్థల రక్షణకు పోరాటం
హన్మకొండ: ప్రభుత్వరంగ సంస్థల రక్షణకు ఐక్యంగా పోరాడాలని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ వరంగల్ రీజియన్ కార్యదర్శి బి.ఉపేంద్ర చారి పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ బుధవారం వరంగల్ రీజియన్‌లోని 9 డిపోల ఎదుట స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమకొండలోని వరంగల్–1, వరంగల్–2, హనుమకొండ డిపోల ఎదుట ఉపేంద్రచారి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు దాసోహం అంటున్న రాష్ట్ర ప్రభుత్వ తీరును ప్రతిఘటిద్దామన్నారు. గత ప్రభుత్వం విధానాలే ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తోందని విమర్శించారు. ఆర్టీసీ ద్వారా విద్యుత్ బస్సులు నడిపితేనే ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలుగుతుందన్నారు. పనిభారంతో కార్మికులు దిక్కుతోచని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పారిశ్రామిక చట్ట ప్రకారం సెలవు అడిగితే ఇవ్వడం లేదని, ఆరోగ్యం బాగాలేదని డాక్టర్ దగ్గరికి వెళ్తే డిపో మేనేజర్ చెప్తేనే సెలవు ఇవ్వని దౌర్భాగ్య స్థితి ఆర్టీసీలో నెలకొందని పేర్కొన్నారు. వేతన సవరణ చేయకుండా కార్మికులకు అందాల్సిన ఆర్థిక ప్రయోజనాలకు గండి కొడుతోందని వాపోయారు. ఇప్పటికై నా ప్రభుత్వం, యాజమాన్యం వైఖరి మార్చుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని, విద్యుత్ బస్సుల విధానంలో మార్పులు చేసి ఆర్టీసీలకే ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వ లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి–2025ని రద్దు చేయాలని, టీజీఎస్ ఆర్టీసీలో కార్మిక సంఘాలపై ఆంక్షలు ఎత్తివేసి గుర్తింపు ఎన్నికలు, సీసీఎస్‌కు ఎన్నికలు జరపాలని, రిటైర్ కార్మికులకు రావాల్సిన అన్ని రకాల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. నాయకులు మహేందర్, శ్రీనివాసు, అశోక్, మోహన్, కార్మికులు పాల్గొన్నారు.
స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ వరంగల్ రీజియన్ సెక్రటరీ ఉపేంద్రచారి


