నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు
హనుమకొండ అర్బన్: హనుమకొండ జిల్లాలో గురువారం నుంచి మొదటి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. మూడు విడతల్లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తొలి విడత ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం కమలాపూర్ మండలంలోని గ్రామ పంచాయతీలను, పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయాల్సిన ఏర్పాట్లపై స్పష్టమైన ఆదేశాలిచ్చారు. అనంతరం కలెక్టరేట్‌లో సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి ఎన్నికల ప్రక్రియపై సమీక్ష చేపట్టారు. జిల్లాలో మొదటి విడతలో భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్ మండలాల్లోని 69 గ్రామ పంచాయతీలు, 658 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. వీటికి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం అధికారికంగా ప్రారంభమవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి జిల్లా వ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలు, వ్యక్తులపై తనిఖీలు కఠినతరం చేసినట్లు అధికారులు వివరించారు. మొత్తం మీద ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, సజావుగా సాగేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తిచేసిందని కలెక్టర్ స్పష్టం చేశారు.
కలెక్టరేట్‌లో ఎన్నికల సహాయక కేంద్రం
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కలెక్టరేట్‌లో ప్రత్యేక ఎన్నికల సహాయక కేంద్రం ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. ఈ సహాయక కేంద్రం మూడు విడతల ఎన్నికలు పూర్తయ్యేవరకు 24 గంటలు పనిచేస్తుందని పేర్కొన్నారు. ఎన్నికలకు సంబంధించిన సందేహాలు, సాంకేతిక సమస్యలు, ఫిర్యాదుల వంటి విషయాల కోసం ప్రజలు 7981975495 ఫోన్ నంబర్‌లో సంప్రదించవచ్చని సూచించారు. నామినేషన్ల స్వీకరణ ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణికుముదిని బుధవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో హనుమకొండ కలెక్టరేట్ నుంచి కలెక్టర్ స్నేహ శబరీష్, సెంట్రల్ జోన్ డీసీపీ దారా కవిత, అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, డాక్టర్ కన్నం నారాయణ, జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీ రమాకాంత్, జెడ్పీ సీఈఓ రవి, ఎంసీసీ నోడల్ అధికారి ఆత్మారాం పాల్గొన్నారు.
ఎన్నికలు సజావుగా నిర్వహించాలి:
వరంగల్ కలెక్టర్ సత్యశారద
వరంగల్/న్యూశాయంపేట: వరంగల్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 317 గ్రామ పంచాయతీల్లో 2,754 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా, 3,83,738 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అందులో భాగంగా డిసెంబర్ 11న మొదటి విడత, 14న రెండో విడత, 17న మూడో విడత ఎన్నికల పోలింగ్ జరుగనుంది. నేడు(గురువారం) రాష్ట్ర ఎన్నికల అధికారి రాణికుముదిని పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయగానే మొదటి విడత జరిగే గ్రామ పంచాయతీల్లో నామినేషన్లను ఈనెల 29వ తేదీ వరకు స్వీకరిస్తారు. 30న స్కూృటినీ, డిసెంబర్ 1న అప్పీలు, 2న అప్పీళ్లపై పరిష్కారం, డిసెంబర్ 3న మధ్యాహ్నం వరకు ఉపసంహరణ గడువు ముగియగానే పోటీలో ఉండే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. ఎన్నికలు జరిగే పంచాయతీల్లో నామినేషన్ల స్వీకరణ ఏర్పాట్లపై బుధవారం కలెక్టర్ సత్యశారద విలేకరులతో మాట్లాడారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీపీఓ కల్పన, నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి పాల్గొన్నారు.
కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం..
జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు కలెక్టరేట్‌లో ఎన్నికల కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ సత్యశారద తెలిపారు. ప్రజలకు ఏమైనా అసౌకర్యం కలిగితే టోల్‌ఫ్రీ నంబర్లు 1800 4253 424, 91542 52936, 0870 2530812కు కాల్ చేసి సహాయం పొందవచ్చని సూచించారు.
పకడ్బందీ ఏర్పాట్లు..
పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణీకుముదినీ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి ఎన్నికల నిర్వహణపై పోలీసు కమిషనర్లు, కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు.
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి..
ఎన్నికల సంఘం నిబంధనలు పాటిస్తూ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో జీపీ, వార్డు స్థానాల ఎన్నికల నిర్వహణపై ఆర్డీఓలు, ప్రత్యేక అధికారులు, నోడల్ అధికారులు, ఏఆర్‌ఓలతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు.
హనుమకొండ జిల్లాలో మొదటి విడత భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్ మండలాల్లో ఎన్నికలు
69 గ్రామ పంచాయతీలు,
658 వార్డులకు పోలింగ్
నిర్వహించనున్న అధికారులు
నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు


