మూడు విడతల్లో ‘స్థానికం’
సాక్షి ప్రతినిధి, వరంగల్:
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం పచ్చజెండా ఊపింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు ఎట్టకేలకు మంగళవారం నగారా మోగింది. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో.. మూడు విడుతలుగా సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు నిర్వహించేలా షెడ్యూల్ ప్రకటించారు. వాస్తవానికి సెప్టెంబర్‌లోనే షెడ్యూల్ విడులైంది. రిజర్వేషన్లపై కోర్టు కేసు, వివాదం కారణంగా అక్టోబర్ మొదటి వారంలో రద్దయ్యాయి. కోర్టు సూచనల మేరకు రిజర్వేషన్లు 50 శాతం మించకుండా ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమైంది.
రేపు నోటిఫికేషన్.. నామినేషన్ల ప్రక్రియ
రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం 27న నోటిఫికేషన్ విడుదల కానుంది. అదేరోజు నుంచి మొదటి విడతకు నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. రెండో విడతకు 30 నుంచి, మూడో విడతకు డిసెంబర్ 3 నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ తర్వాత ఎన్నికల సంఘం గుర్తులు కేటాయిస్తుంది. షెడ్యూల్ ప్రకారం ఈ ప్రక్రియ పూర్తికాగానే 11, 14, 17 తేదీల్లో పోలింగ్ నిర్వహించి కౌంటింగ్ అనంతరం ఫలితాలు వెల్లడించనున్నారు. ఉమ్మడి జిల్లాలోని 1,708 గ్రామ పంచాయతీలు, 15,006 వార్డులకు ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకోసం 15,026 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేయనున్నారు.
25 రోజులపాటు ఎన్నికల కోడ్..
షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని అధికారులు ప్రకటించారు. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో మాత్రం మినహాయింపు ఉంటుంది. కాగా, ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో జిల్లాలను కలిపే సరిహద్దుల్లో చెక్‌పోస్టులను నెలకొల్పేందుకు పోలీసు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. నేటి నుంచే ఈ ప్రక్రియ ప్రారంభమయ్యేలా చూస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా సుమారు 25 రోజులపాటు ఎన్నికల కోడ్ అమల్లో ఉండనుంది. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలకు బ్రేక్ పడనుంది. ఇదిలా ఉండగా ప్రధాన రాజకీయ పార్టీలు గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తుండగా.. బీఆర్‌ఎస్, బీజేపీ కూడా చాలెంజ్‌గా తీసుకుంటున్నాయి. వామపక్షాలు, ఇతర పార్టీలు సైతం ‘స్థానిక’ంలో సత్తా చాటేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే ఆశావహులు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తుండగా.. ప్రధాన పార్టీలు మాత్రం గెలుపు గుర్రాలకే అవకాశం కల్పించేందుకు దృష్టి సారించాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సర్పంచ్ స్థానాలను అత్యధికంగా గెలుచుకునేందుకు కసరత్తు చేస్తున్నాయి.
హన్మకొండ అర్బన్ : జిల్లాలోని 210 గ్రామ పంచాయతీల్లో తుది జాబితాలో మొత్తం 3,70,871 మంది ఓటర్లుగా నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. మొత్తం ఓటర్లలో 1,80,666 పురుషులు, 1,90,201 మహిళలు ఉన్నారు. నలుగురు ట్రాన్స్‌జెండర్లు ఓటర్లుగా ఉన్నారు. దీంతో ఈసారి ఎన్నికల్లో మహిళా ఓటర్లదే హవా కొనసాగనుంది. పురుషుల కంటే మహిళా ఓటర్లు 9,535 మంది అధికంగా ఉండడం విశేషం.
నూతన జీపీల్లో తొలిసారి పోలింగ్..
జిల్లాలో మూడు గ్రామ పంచాయతీలు తొలిసారిగా నూతన పంచాయతీలుగా ఏర్పడ్డాయి. దీంతో ఆయా గ్రామ పంచాయతీల్లో మొదటిసారి పోలింగ్ జరుగనుంది. భీమదేవరపల్లి మండలంలోని సాయినగర్, వీరభద్ర నగర్, ఎల్కతుర్తి మండలంలోని రామకృష్ణపూర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి.
ఏకగ్రీవ జీపీలకు నజరానా లేనట్లేనా?
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖర్చు తగ్గించేందుకు ఎన్నికల సంఘం కొన్ని ప్రోత్సాహకాలు ప్రకటించింది. అందులో ముఖ్యంగా గ్రామ పంచాయతీతో పాటు వార్డుల సహా మొత్తం ఏకగ్రీవమైన జీపీలకు రూ.5లక్షల నజరానా ప్రకటించి అందజేశారు. అయితే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ గాని, ప్రభుత్వం నుంచి గాని ప్రస్తుతం అలాంటి ప్రకటన ఎక్కడ వెలువడకపోవడంతో ఏకగ్రీవాలపై ఆసక్తి ఉన్న చోట్ల నిరాశే ఎదురవుతోంది. రాష్ట్ర విభజన అనంతరం రూ.10 లక్షలు ఇస్తామని ప్రకటించిన ఏకగ్రీవ పంచాయతీలకు ఎన్నికల అనంతరం మొండిచేయి చూపారు. పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినప్పటికీ నిధులు మాత్రం రాలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి ప్రభుత్వం, ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి ప్రకటన కూడా లేదు.
హనుమకొండ జిల్లాలో ఎన్నికలు ఇలా
విడత మండలాలు పంచాయతీలు వార్డులు
మొదటి 3 69 658
రెండు 5 73 694
మూడు 4 68 634
మొత్తం 12 210 1,986
వరంగల్ జిల్లాలో ఎన్నికలు ఇలా..
మొదటి 3 91 800
రెండు 4 117 1,008
మూడు 4 109 946
మొత్తం 11 317 2,754
మోగిన పంచాయతీ ఎన్నికల నగారా
ఉమ్మడి వరంగల్‌లో
అమల్లోకి వచ్చిన కోడ్
కార్పొరేషన్, మున్సిపాలిటీలకు
మినహాయింపు
మండల, జిల్లా సరిహద్దుల్లో
చెక్‌పోస్టుల ఏర్పాటుకు సన్నాహాలు
పోటాపోటీగా ఆశావహులు..
గెలుపు గుర్రాలకే అవకాశం..
ప్రధాన పార్టీల కసరత్తు


