సాస్కి ప్రతిపాదనలు సిద్ధం చేయండి
బల్దియా కమిషనర్ బాజ్‌పాయ్
వరంగల్ అర్బన్ : సాస్కి పథకం ప్రతిపాదనలను డిసెంబర్ 15వ తేదీలోగా యుద్ధ ప్రతిపాదికన సిద్ధం చేయాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం హనుమకొండలోని కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) మినీ సమావేశ మందిరంలో బల్దియా, కుడా ఉన్నతాధికారులతో సాస్కి ప్రతిపాదనల సమర్పణపై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. 2నెలల నుంచి సాస్కి పథకంలో భాగంగా పలు ప్రతిపాదనలు సమర్పించేందుకు అధికారులకు సూచనలు చేసినట్లు తెలిపారు. ఈ పథకంలో నీటి సరఫరా, డ్రెయినేజీ నెట్‌వర్క్, జీఐఎస్, మున్సిపల్ ఆస్తుల మ్యాపింగ్, పాత బావుల పునరుద్ధరణ, పునరుజ్జీవనం, నైబర్‌వుడ్ అంశాల్లో పురోగతి వంటి వాటిని ఈ ప్రాజెక్ట్‌లో చేర్చినట్లు వెల్లడించారు. గడువులోగా నివేదికలు సమర్పిస్తే వరంగల్ నగరానికి ప్రోత్సాహక మొత్తం లభించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. బుధవారం (నేడు) సాయంత్రం వరకు ప్రాథమిక నివేదికలు అందజేయాలని కమిషనర్ కోరారు. అనంతరం కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు చెప్పారు. సమావేశంలో ‘కుడా’ సీపీఓ అజిత్ రెడ్డి, బల్దియా ఎస్‌ఈ సత్యనారాయణ, ఇన్‌చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, బల్దియా ఈఈ సంతోష్ బాబు, కుడా ఈఈ భీమ్‌రావు తదితరులు పాల్గొన్నారు.


