చెత్తను స్వచ్ఛ ఆటోలకు చేరవేయాలి
వరంగల్ అర్బన్ : నగరవాసులు చెత్తను స్వచ్ఛ ఆటోలకు అందజేయాలని, అందజేయని వారికి నోటీసులు జారీ చేయాలని నగర మేయర్ గుండు సుధారాణి తెలిపారు. రోడ్ల మీద, కాల్వల్లో వేస్తే జరిమానా విధించాలని ఆదేశించారు. శనివారం వరంగల్‌లోని 24, 25, 28 డివిజన్లలో మేయర్ సుధారాణి తనిఖీలు చేశారు. ప్రతీ ఇంటినుంచి చెత్త సేకరణ ఏవిధంగా జరుగుతుంది.. తడి, పొడి చెత్తను వేరుగా అందిస్తున్నారా.. లేదా? అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. చెత్త డబ్బాల పంపిణీపై ఆరా తీశారు. మోడల్ వార్డులుగా తీసుకున్న 16 డివిజన్లలో నిర్ణీత షెడ్యూల్ ప్రకారం డ్రెయిన్‌లను శుభ్రం చేయాలని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను వాడకుండా చర్యలు చేపట్టాలని కోరారు. అనంతరం పోతననగర్‌లోని సెకండ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌ను సందర్శించి చెత్త తరలింపు వాహనాల పని విధానాన్ని పరిశీలించారు.
ఆస్తులు, ట్రేడ్ లైసెన్స్‌లను రివిజన్ చేయాలి
ఆస్తి, నీటిపన్నుల వసూళ్లలో పురోగతి కనిపించాలని మేయర్ గుండు సుధారాణి అన్నారు. శనివారం బల్దియా ప్రధాన కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. అసెస్‌మెంట్లు, ట్రేడ్ లైసెన్స్‌లు, నల్లాల పునఃపరిశీలన చేయాలన్నారు.
దేశాయిపేట నుంచి
పోచమ్మమైదాన్‌కు కొత్త పైప్‌లైన్
దేశాయిపేట ఫిల్టర్ బెడ్‌నుంచి పోచమ్మ మైదాన్ వరకు 1950 కాలం నాటి పైప్‌లైన్ వల్ల తరచూ లీకేజీలు ఉత్పన్నమవుతున్నాయని మేయర్ గుండు సుధారాణి తెలిపారు. పోచమ్మమైదాన్‌లో పైప్‌లైన్, డ్రెయినేజీ పనులు మేయర్ పరిశీలించారు. కొత్త పైప్‌లైన్ నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో వరంగల్ ప్రాంతంలో తాగునీటి ఇబ్బందులు తలెత్తవని పేర్కొన్నారు. ఆయా కార్యక్రమాల్లో కార్పొరేటర్ తేజస్వి శిరీష్, అదనపు కమిషనర్ చంద్రశేఖర్, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, రవీందర్, సీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజారెడ్డి, ఎంహెచ్‌ఓ డాక్టర్ రాజేశ్, పన్నుల అధికారి రామకృష్ణ పాల్గొన్నారు.
అందజేయని వారికి
నోటీసులు ఇవ్వండి
నగర మేయర్ గుండు సుధారాణి


