పట్టణ నిరాశ్రయులను పక్కాగా గుర్తించాలి
బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్
వరంగల్ అర్బన్ : పట్టణ నిరాశ్రయులను గుర్తించి వారి సమాచారాన్ని పక్కాగా నమోదు చేయాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. నగరంలో నిరాశ్రయులను గుర్తించడానికి కొనసాగుతున్న సర్వే, స్వీపింగ్ యంత్రాల పనితీరును శుక్రవారం రాత్రి కమిషనర్ తనిఖీ చేశారు. హనుమకొండ చౌరస్తా, వరంగల్ రైల్వే స్టేషన్‌ను ప్రధాన రహదారుల్లో నిరాశ్రయులను పరిశీలించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ ఎలాంటి ఆవాసం లేకుండా ఉన్న వారిని సర్వేలో నమోదు చేయడంతో పాటు బల్దియా నిర్వహిస్తున్న షెల్టర్ హోమ్‌లకు తరలించాలన్నారు. వరంగల్ ప్రతాప్‌నగర్‌లోని హోమ్ షెల్టర్‌ను తనిఖీ చేశారు. కార్యక్రమంలో సీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజారెడ్డి, డీఎఫ్‌ఓ శంకర్ లింగం, డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, శానిటరీ సూపర్‌వైజర్ గోల్కొండ శ్రీను, టీఎంసీ రమేశ్, కమ్యూనిటీ ఆర్గనైజర్లు పాల్గొన్నారు.
ట్రేడ్ వసూళ్లపై దృష్టి పెట్టండి
శానిటరీ ఇన్‌స్పెక్లర్లు, జవాన్లు ట్రేడ్ వసూళ్లపై సీరియస్‌గా దృష్టి సారించాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదేశించారు. శనివారం బల్దియా ప్రధాన కార్యాలయంలో ట్రేడ్ వసూళ్ల పురోగతిపై శానిటరీ ఇన్‌స్పెక్టర్లతో సమావేశమై సమర్థంగా చేపట్టేందుకు సూచనలిచ్చారు. నెల రోజుల నుంచి ట్రేడ్ వసూళ్లలో పురోగతి ఏ మాత్రం కనిపించడం లేదన్నారు.


