ఎంజీఎం వైద్యసేవల్లో నిర్లక్ష్యం
సాక్షి, వరంగల్: ఎంజీఎం ఆస్పత్రిలో అత్యవసర వైద్య సేవలపై నిర్లక్ష్యం ఉందని మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్ అన్నారు. వరంగల్ కలెక్టరేట్‌లో ఎంపీ అధ్యక్షతన ఆ జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ పోరిక బలరాంనాయక్ మాట్లాడుతూ.. రాత్రివేళ అత్యవసర కేసులు వస్తే ఎంజీఎం ఆస్పత్రి వైద్యసేవల్లో అలసత్వం ఉందని పేర్కొన్నారు. తమ ప్రాంతం నుంచి వచ్చిన వారికి వైద్యం కోసం గత ఎంజీఎం ఉన్నతాధికారిని ఫోన్‌లో సంప్రదిస్తే స్విచ్ఛాఫ్ అని కొన్నిసార్లు, మరికొన్నిసార్లు స్పందించలేదని గుర్తు చేశారు. అందుకే అత్యవసర కేసుల కోసం ప్రత్యేక కౌంటర్‌ను ప్రారంభించి, షిఫ్ట్ పద్ధతిలో వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని సూపరింటెండెంట్ హరీశ్‌చంద్రారెడ్డిని కోరారు. ఆస్పత్రిని పరిశుభ్రంగా ఉంచేందుకు, వైద్య పరికరాల కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో మాట్లాడుతామని పేర్కొన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ (సీఎస్‌ఆర్) కింద నిధులు ఇప్పించే ప్రయత్నం చేస్తామని, మీరు కూడా దాతలను సంప్రదించి ఎంజీఎం ఆస్పత్రి అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని సూచించారు.
అక్షయపాత్ర సేవలు విస్తరించాలి..
వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ వరంగల్, ఖిలావరంగల్ మండలాల్లోని 119 ప్రభుత్వ పాఠశాలల్లో భోజనం అందిస్తున్న అక్షయపాత్ర.. నియోజకవర్గ పరిధిలోని 14, 43 డివిజన్లు, పర్వతగిరి, వర్ధన్నపేట మండలాల ప్రభుత్వ పాఠశాలల్లోనూ అందించేందుకు కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య పాల్గొన్నారు. కాగా, తూర్పు ఎమ్మెల్యే, మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి సమావేశానికి హాజరుకాలేదు.
రాత్రి వేళ ఎమర్జెన్సీ కేసుల్లో అలసత్వం
వరంగల్ ‘దిశ’ సమావేశంలో
మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్


