లక్ష్యాలు సాధించాలి
● టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ
కర్నాటి వరుణ్ రెడ్డి
హన్మకొండ : వచ్చే మూడు నెలలకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుని నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి 17 సర్కిళ్ల ఎస్‌ఈలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి పంటలు పూర్తవుతున్నందున వ్యవసాయ సర్వీస్‌ల రిలీజ్ వేగవంతం చేయాలని సూచించారు. పెండింగ్ పనులు పూర్తి చేయాలని, మెటీరియల్ అందుబాటులో ఉందన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ స్టేషన్ల సర్వీస్ మంజూరు వేగవంతం చేయాలన్నారు. టీజీ ఐపాస్, హెచ్‌టీ సర్వీస్‌లపై సమీక్షిస్తూ సర్వీస్‌ల మంజూరులో జాప్యం లేకుండా చూడాలన్నారు. ఈ వీసీలో చీఫ్ ఇంజనీర్ టి.సదర్‌లాల్, 17సర్కిళ్ల ఎస్‌ఈలు, కమర్షియల్ డీఈ జమున, ఏడీఈ మధుకర్, మౌనిక పాల్గొన్నారు.
హన్మకొండ : నగరంలోని ములుగు రోడ్డులో నూతనంగా నిర్మిస్తున్న టీజీ ఎన్పీడీసీఎల్ వరంగల్ సర్కిల్ కార్యాలయ నూతన భవనం, జిల్లా స్టోర్స్ నిర్మాణ పనులను ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. సర్కిల్ కార్యాలయ భవనం వచ్చే ఏడాది జనవరి 26 నాటికి, వరంగల్ డిస్ట్రిక్ట్ స్టోర్స్‌ను డిసెంబర్ 31వరకు పూర్తయ్యేలా పనులు వేగవంతం చేయాలని ఆయన సూచించారు.
జల్సాల కోసం చోరీ
● నిందితుడి అరెస్ట్
● బంగారం స్వాధీనం చేసుకున్న
పోలీసులు
హన్మకొండ : జల్సాలకు అలవాటు పడిన ఓ యువకుడు తన బావ ఇంట్లోనే చోరీకి పాల్పడ్డాడు. శుక్రవారం పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానం రావడంతో అతడిని పట్టుకొని అరెస్ట్ చేసి దొంగలించిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మడికొండ పోలీస్ ఇన్‌స్పెక్టర్ కిషన్ కథనం ప్రకారం.. హైదరాబాద్‌లోని కోఠిలో గల చాపల్ బజార్‌కు చెందిన ఐలవేని సాయిరోహిత్ రాపిడో నడుపుతూ జీవిస్తున్నాడు. అతడు ప్రస్తుతం బెల్లంపల్లిలో నివాసిస్తున్నాడు. జల్సాలకు అలవాటు పడిన సాయిరోహిత్ ఆరునెలల క్రితం మడికొండ పరిధిలోని కడిపికొండలోని తన బావ బూతగడ్డ సతీష్ ఇంట్లోనే దొంగతనం చేశాడు. చోరీ చేసిన బంగారాన్ని వరంగల్‌లో విక్రయించేందుకు అయోధ్యపురం గేట్ నుంచి కాజీపేట మీదుగా బైక్‌పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో మడికొండ పీఎస్ పరిధిలోని అయోధ్యపురం రైల్వే గేట్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా అనుమానం వచ్చిన పోలీసులు సాయిరోహిత్ ను పట్టుకొని విచారించగా సతీష్ ఇంట్లో దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. అతడి వద్దనుంచి 47.5 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి రిమాండ్ పంపినట్లు ఇన్‌స్పెక్టర్ కిషన్ పేర్కొన్నారు.
లక్ష్యాలు సాధించాలి


