ఏసీబీకి చిక్కిన మిషన్ భగీరథ డిప్యూటీ ఈఈ
పాలకుర్తి టౌన్ : మిషన్ భగీరథ డిప్యూటీ ఈఈ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కింది. ఈ ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని మిషన్ భగీరథ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. ఖమ్మం ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్ కథనం ప్రకారం.. పాలకుర్తి సబ్–డివిజన్ మిషన్ భగీరథ డిప్యూటీ ఈఈ (ఉపకార్యనిర్వాహక ఇంజనీర్) కూనమళ్ల సంధ్యారాణి దేవరుప్పల మండలంలోని పలు గ్రామాలకు సంబంధించిన పైపులైన్ బిల్లు రూ.1.5లక్షల చెల్లింపునకు గాను పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన కాంట్రాక్టర్ కమ్మగాని సురేష్‌నుంచి రూ.10వేలు లంచం డిమాండ్ చేసింది. సురేష్.. మిషన్ భగీరథ కార్యాలయంలో ప్రైవేట్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మహేందర్ నాయక్ ఫోన్ పేకు రూ.10వేలు పంపాడు. అదే సమయంలో ఏసీబీని ఆశ్రయించాడు. ప్లాన్ ప్రకారం.. బాధితుడు సురేష్ ఆ ఫోన్ పేను స్క్రీన్ షాట్ తీసి శుక్రవారం సాయంత్రం డీఈ సంధ్యారాణికి చూపించాడు. ఏసీబీ డీఎస్పీ రమేశ్ ఆధ్వర్యంలో సదరు డిప్యూటీ ఈఈని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. బాధితుడు సురేష్ నుంచి వాంగ్మూలం నమోదు చేశారు. దాడుల్లో ఏసీబీ సీఐలు ఎస్.రాజు, ఎల్,రాజు సిబ్బంది పాల్గొన్నారు.
లంచమడిగితే ఫోన్ చేయండి..
ఈ సందర్భంగా ఏసీబీ డీఏస్పీ రమేశ్ మాట్లాడుతూ ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగితే వరంగల్ ఏసీబీ కార్యాలయానికి వెళ్లి నేరుగా ఫిర్యాదు చేయాలని తెలిపారు. టోల్ ఫ్రీ నంబర్ 1046, వాట్సాప్ నంబర్ 94404 46106 కూడా సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. అధికారులు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెడితే ఆధారాలతో ఫిర్యాదు చేయాలని, తక్షణమే స్పందించి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
పైపులైన్ బిల్లు కోసం
రూ.10 వేలు లంచం


