తెలంగాణ గోల్డ్ కప్ క్రికెట్ ఎంపిక పోటీలు
వరంగల్ స్పోర్ట్స్ : హైదరాబాద్ వేదికగా వచ్చేనెలలో నిర్వహించనున్న ఓపెన్ టు ఆల్ తెలంగాణ గోల్డ్ కప్–2025, టీ20 టోర్నమెంటు కోసం జిల్లా జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ పెసరు విజయ్‌చందర్ రెడ్డి తెలిపారు. హనుమకొండలోని టీసీఏ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విజయ్‌చందర్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికి తీసేందుకు రాష్ట్రాన్ని ఐదు జోన్లుగా విభజించి జట్లను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ఈ నెల 23న ఉదయం 10గంటలకు వరంగల్‌లోని ఓసిటీలో, హనుమకొండలోని జేఎన్ స్టేడియంలో రెండు జిల్లాల జట్లను ఎంపిక చేస్తామన్నారు. ఆయా జట్లు ఈ నెల24న ఖమ్మంలో జరిగే ఈస్ట్ జోన్‌లీగ్ మ్యాచ్‌లో పాల్గొంటాయన్నారు. ఎంపికై న క్రీడాకారులకు యూనిఫాం, క్రికెట్ కిట్టు టీసీఏ ఉచితంగా అందజేస్తోందన్నారు. ఇతర వివరాలకు ఈస్ట్‌జోన్ కోఆర్డినేటర్లు తాళ్లపల్లి జైపాల్ 95811 24444, సమీ 90325 24193 నంబర్లలో సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
రేపటినుంచి జిల్లాస్థాయి క్రికెట్ ఎంపికలు
గ్రామీణ స్థాయిలో ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించి, వారిని మరింతగా ప్రోత్సహించేందుకు ఈ నెల 23, 24వ తేదీల్లో జిల్లాస్థాయి అండర్–14 బాలుర విభాగంలో ఎంపికలు నిర్వహిస్తున్నట్లు క్రికెట్ అసోసియేషన్ వరంగల్ జిల్లా కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ తెలిపారు. హనుమకొండ, వరంగల్, జనగామ, భూపాలపల్లి, ములుగు, మహబూబ్‌బాద్ జిల్లాల్లో నిర్వహించిన ఎంపికల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులతో కూడిన ఆరు క్రికెట్ జట్లు ఉమ్మడి వరంగల్ జిల్లా వేదికగా ఈ నెల చివరి వారం నుంచి నిర్వహించే వన్‌డే లీగ్ టోర్నమెంటులో పాల్గొంటుందని తెలిపారు. ఇందులో రాణించిన క్రీడాకారులను ఉమ్మడి వరంగల్ జిల్లా జట్టుకు ప్రాతినిథ్యం వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు రెండు రోజుల పాటు స్టేషన్‌ఘన్‌పూర్ సమీపంలోని కరుణాపురంలోని వంగలపల్లిలో గల డబ్ల్యూడీసీఏ క్రికెట్ క్రీడా మైదానంలో హాజరు కావాలని సూచించారు. 2011, సెప్టెంబర్ 1తర్వాత జన్మించిన వారు అర్హులుగా పేర్కొన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు మీసేవా ద్వారా జారీ చేసిన జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్‌కార్డు, సొంత క్రికెట్ కిట్టుతో హాజరుకావాలని తెలిపారు.


