దౌర్జన్యంగా ఇల్లు కూల్చివేత
ఖిలా వరంగల్ : పాత ఇంట్లో పిల్లలతో సహా అద్దెకుంటున్న ఓ మహిళపై అల్లరి మూకలు దాడి చేసి ఇంట్లో సామగ్రి ఉండగానే పొక్లెయినర్‌తో ఇల్లు కూల్చివేశారు. ఇంటిని ఖాళీ చేసేందుకు సమయం ఇవ్వాలని ప్రాధేయపడిన ససేమిరా అంటూ దౌర్జన్యంగా మహిళ, పిల్లలను రోడ్డుపై నెట్టేసి విధ్వంసం సృష్టించారు. ఈఘటన శుక్రవారం సాయంత్రం ఖిలావరంగల్ తూర్పుకోటలో జరిగింది. బాధితురాలి కథనం ప్రకారం.. తూర్పుకోటకు చెందిన అప్పని కవిత తన ముగ్గురు పిల్లలతో కలిసి గాండ్ల శారద, సూర్యనారాయణకు చెందిన ఇంట్లో 18ఏళ్లుగా అద్దెకుంటోంది. ఖాళీ చేయడానికి కనీసం 15రోజుల సమయం కావాలని సదరు మహిళ ఇంటి యజమానికి కోరింది. అయినా అవేమి పట్టించుకోకుండా శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా పదిమంది మహిళలతోపాటు కొందరు అక్కడికి చేరుకున్నారు. ఇంట్లో ఉన్న కవిత, తన పిల్లలపై దాడి చేసి వారిని వీధిలో నెట్టేసి విలువైన సామాన్లు ఇంట్లో ఉండగానే దౌర్జన్యంగా ఇంటిని క్షణాల్లో కూల్చివేసి వెళ్లిపోయారు. దీంతో సుమారు రూ.5లక్షల విలువైన ఫ్రీడ్జి, టీవీ, కూలర్, వంట సామగ్రి, బీరువా, నిత్యావసర సరుకులు, ధ్వంసమై మట్టిలో ఉన్నాయని, గ్యాస్ లీకేజీ అవుతోందని కవిత బోరునవిలపించింది. బాధితురాలు డయల్–100కు సమాచారం ఇవ్వగా మిల్స్‌కాలనీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. దాడిచేసిన వ్యక్తులు, ఆర్థికంగా నష్టం చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కవిత శుక్రవారం రాత్రి వరంగల్ ఏఎస్పీ శుభంను కలిసి ఫిర్యాదు చేసింది.
రూ.5లక్షల గృహోపకరణాలు ధ్వంసం మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు


