ఇంటింటికీ ఇందిరమ్మ చీరలు
హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులకు చీరల పంపిణీ కార్యక్రమం డిసెంబర్ 9లోగా పూర్తి చేసేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈవిషయంలో ముఖ్యమంత్రి స్వయంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడంతో పాటు కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులతో సమీక్షించి పంపిణీకి సంబంధించి దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం మహిళా సంఘాలకు సెర్ప్, మెప్మా ద్వారా యూనిఫామ్ పేరుతో ప్రభుత్వం చీరలు అందజేయనుంది. ఇప్పటికే జిల్లా కేంద్రానికి చేరుకున్న చీరలు అధికారులు గ్రామస్థాయిలో పంపిణీకి ఏర్పాట్లు ప్రారంభించారు. గ్రామాల్లో పంపిణీ ప్రారంభించి డిసెంబర్ 9 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గత ప్రభుత్వం పంపిణీ చేసిన దసరా చీరల ధర సుమారు రూ.260 వరకు ఉండేది. నాణ్యత లోపించిందని విమర్శలు వచ్చాయి. కానీ, ప్రస్తుతం పోచంపల్లి కోట చీరలు ఒక్కోటి రూ.800 ధరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. సంవత్సరానికి రెండు చీరలు మహిళా సంఘాల సభ్యులకు యూనిఫామ్ పేరుతో అందజేస్తున్నారు. హనుమకొండ జిల్లాలో అర్బన్, రూరల్ ప్రాంతాల్లో కలిపి సుమారు 3 లక్షల మంది వరకు మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉన్నట్లు డీఆర్డీఏ, మెప్మా అధికారులు లెక్కలు అందజేశారు. మెప్మా పరిధిలో 1,71,604 మంది సభ్యులు ఉండగా, మిగతావారు డీఆర్డీఏ పరిధిలో ఉన్నారు. ఆ లెక్కల ఆధారంగా ప్రభుత్వం జిల్లాకు చీరల కోటా అందజేశారు
9, 6 మీటర్ల నిడివి చీరలు
మహిళలు వారి వయసు, అర్బన్, రూరల్ ప్రాంతాల వారు సంప్రదాయాల ప్రకారం ధరించే చీరలనే ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో తయారు చేయించింది. గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 1,800కు పైగా మహిళల కోసం 9 మీటర్ల నిడివి చీరలను సిద్ధం చేయించారు. అర్బన్ ప్రాంతాల్లో మహిళల కోసం 6.3 మీటర్ల నిడివి చీరలు పంపిణీకి సిద్ధం చేశారు. చీరల పంపిణీ గతంలో మాదిరిగా రేషన్ డీలర్లకు అప్పగించకుండా ఈసారి గ్రామస్థాయిలో ప్రత్యేక అధికారులకు బాధ్యతలు అప్పగించారు.
అన్ని ఏర్పాట్లు చేశాం..
జిల్లాలో డిసెంబర్ 9 నాటికి మహిళా సంఘాలకు చీరలు పంపిణీ చేయాలని కలెక్టర్ స్పష్టంగా ఆదేశించారు. అందుకు తగినట్లుగా జిల్లా కేంద్రానికి చేరిన చీరలను గ్రామాలకు తరలించి పంపిణీ ప్రారంభిస్తున్నాం. ప్రత్యేక అధికారులే చీరల పంపిణీకి గ్రామస్థాయిలో బాధ్యులుగా ఉంటారు. మహిళా సంఘాల సమన్వయంతో పంపిణీ పూర్తి చేస్తారు. – మేన శ్రీను, డీఆర్డీఓ పీడీ
హనుమకొండ జిల్లాకు
2.90 లక్షల చీరలు
డిసెంబర్ 9లోగా చీరల పంపిణీ
మహిళా సంఘాలు, పంచాయతీ
కార్యదర్శులకు పంపిణీ బాధ్యతలు
ఇంటింటికీ ఇందిరమ్మ చీరలు


