అర్థమయ్యేలా పాఠాలు బోధించండి
హనుమకొండ కలెక్టర్ స్నేహశబరీష్
హసన్‌పర్తి : విద్యార్థులకు అర్థమయ్యేలా పాఠాలు బోధించాలని కలెక్టర్ స్నేహశబరీష్ ఉపాధ్యాయులకు సూచించారు. గురువారం మండలంలోని కోమటిపల్లి అంగన్‌వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాల, చింతగట్టులోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలతో పాటు జయగిరిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు.ఈ సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రంలో విద్యార్థుల నమోదును పరిశీలించారు. చింతగట్టు ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం తగ్గడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల గైర్హాజరుకు గల కారణాలను అడిగారు. ఆంగ్లభాషపై పట్టు సాధించే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని, ఆయా సబ్జెక్ట్‌ల్లో నాణ్యమైన బోధనలతో పాఠ్యాంశాలు అర్థవంతంగా వివరించాలని సూచించారు. అనంతరం ఆర్టీఓ కార్యాలయాన్ని సందర్శించగా సొంత భవనానికి భూమి కేటాయించాలని అధికారులు కోరారు. ఇందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. తహసీల్దార్ కిరణ్‌కుమార్, ఎంఈఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలి
హన్మకొండ అర్బన్ : జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని హనుమకొండ కలెక్టర్ స్నేహశబరీష్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్నేహశబరీష్ మాట్లాడుతూ.. ఏఎన్‌ఎంలు 12వారాల్లోపు ప్రతి గర్భిణి వివరాలు నమోదు చేయాలన్నారు. పోషణలోపం ఉన్న పిల్లలకు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి చికిత్స అందించడంతోపాటు తల్లిదండ్రులకు పోషకాహారంపై అవగాహన కల్పించాలన్నారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా వీలైనంత త్వరగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో హనుమకొండ ప్రసూతి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి, అదనపు డీఎంహెచ్‌ఓ డాక్టర్ మదన్‌మోహన్‌రావు, జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి గౌతమ్ చౌహర్, టీబీ నియంత్రణాధికారి డాక్టర్ హిమబిందు, వైద్యులు శ్రీనివాస్, ఇఫ్తకర్ అహ్మద్, మంజుల, అశోక్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.


