మహాజాతరకు ఆర్టీసీ సమాయత్తం..
హన్మకొండ : ములుగు జిల్లా ఎస్‌ఎస్‌తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు ఆర్టీసీ సమాయత్తమైంది.గత జాతర వైఫల్యాలు సమీక్షించుకుంటూ పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా భక్తులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఏర్పాట్లు చేస్తోంది. 2026 జనవరి 28, 29, 30, 31 తేదీల్లో వన దేవతల జాతర జరగనుంది. ఈ జాతరకు భక్తులను చేర వేయడంతో పాటు తిరుగు ప్రయాణంలో గమ్యస్థానాలకు చేరవేసేందుకు 2026 జనవరి 25 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడపనుంది. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి జిలాలతో పాటు మహారాష్ట్ర నుంచి బస్సులు నడిపేలా కార్యాచరణ సిద్ధం చేశారు.
ఉచిత ప్రయాణంతో
భక్తుల సంఖ్య పెరుగుతుందని అంచనా
గత జాతరకు ఆర్టీసీ బస్సుల ద్వారా లక్షల సంఖ్యలో భక్తులను చేరవేయగా, ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. ఈక్రమంలో ఈ జాతరకు కూడా బస్సులకు భక్తులు పోటెత్తుతారని ఆర్టీసీ భావిస్తోంది. దీంతో 4 వేల ప్రత్యేక బస్సులు నడపాలని అధికారులు ముందుగా నిర్ణయించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 17 ప్రత్యేక పాయింట్ల నుంచి బస్సులు నడుపనున్నారు. ఈ మేరకు బస్ పాయింట్ల గుర్తింపు ప్రక్రియ చేపట్టారు.
చురుగ్గా సాగుతున్న పనులు..
మేడారంలో ఆర్టీసీకి కేటాయించిన స్థలంలో పనులు చురుగ్గా సాగుతున్నాయి. జేసీబీలు, డోజర్లతో స్థలాన్ని చదును చేస్తున్నారు. దీంతో పాటు క్యూ రెయిలింగ్ పనులు మొదలు పెట్టనున్నారు. మేడారంలో 50 ఎకరాల్లో బస్సుల పార్కింగ్, మరమ్మతుల షెడ్, కార్మికులు, అధికారుల వసతి, తాగు నీటి సౌకర్యం, మరుగుదొడ్ల ఏర్పాటుతోపాటు, ప్రయాణికులు బస్సులు తిరిగి వెళ్లే క్రమంలో విశ్రాంతి తీసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు, భక్తులు బస్సులోకి చేరేందుకు రెయిలింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. బస్సులు ఎక్కేందుకు 50 క్యూ రెయిలింగ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులు ఒక్కసారిగా తిరుగు ప్రయాణానికి వస్తే వెనువెంటనే బస్సులు సమకూర్చేందుకు తాడ్వాయి వద్ద 6 ఎకరాల్లో పార్కింగ్‌తో పాటు టికెట్ జారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కార్మికులకు విశ్రాంతి గదులు ఏర్పాటు చేయనున్నారు. దారి మధ్యలో బస్సులు ఫెయిలైతే 12 మొబైల్ టీమ్‌లు ఏర్పాటు చేయనున్నారు. క్యాంపులు కూడా ఏర్పాటు చేసి మెకానిక్‌లను అందుబాటులో ఉంచుతారు.
2026 జనవరి 28, 29, 30, 31 తేదీల్లో మేడారం జాతర
వివిధ చోట్ల నుంచి జాతరకు
4 వేల బస్సులు..
మేడారంలో ఆర్టీసీకి 50 ఎకరాలు కేటాయింపు
చురుగ్గా సాగుతున్న పనులు
ఉచిత ప్రయాణంతో భక్తుల సంఖ్య
పెరుగుతుందని అంచనా


