పత్తి కొనుగోళ్లు షురూ..
వరంగల్ : పత్తి కొనుగోళ్లు మళ్లీ షురూ అయ్యాయి. సీసీఐ నిబంధనలతో విసుగెత్తిన జిన్నింగ్ మిల్లర్లు, ట్రేడర్స్ ఈనెల 17వ తేదీన నిరవధిక బంద్ చేపట్టారు. దీంతో ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగింది. దేశం మొత్తం అమలవుతున్న సీసీఐ నిబంధనలను సడలించాలంటే సమయం పడుతుందని అప్పటి వరకు సహకరించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మార్కెటింగ్ కార్యదర్శులు మిల్లర్లు, ట్రేడర్లను కోరారు. దీంతో బంద్‌ను వాయిదా వేసుకున్న మిల్లర్లు, ట్రేడర్లు.. బుధవారం నుంచి పత్తి కొనుగోళ్లు చేపట్టారు. దీంతో రైతులు ఉత్సాహంగా వరంగల్ వ్యవసాయ మార్కెట్‌కు పత్తి తరలించారు. మార్కెట్‌లో జెండా పెట్టగా గరిష్ట ధర రూ.6, 830 పలికింది. మొత్తం 2,401క్వింటాళ్లను ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేశారు. మార్కెట్ పరిధిలో 31 జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ కేంద్రాలను నోటిఫై చేశారు. ఇందులో భాగంగా వరంగల్, హనుమకొండ జిల్లాల్లో 15, 03 చొప్పున సీసీఐ కేంద్రాలను ప్రారంభించింది. వీటిలో బుధవారం 611 మంది రైతుల వద్ద నుంచి 9,870 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారు.
చెప్పిన ధరలకే విక్రయం...
బంద్ ప్రభావం రైతులపై పడింది. సీసీఐకి విక్రయించాలంటే కపాస్ యాప్‌లో నమోదు, స్లాట్ బుకింగ్, తేమ శాతం 12కంటే ఎక్కువ ఉంటే తిరిగి పంపుతారనే భయంతో రైతులు మార్కెట్‌కు తీసుకొచ్చి న పత్తిని ప్రైవేట్ వ్యాపారులకు విక్రయించారు. వ్యాపారులు చెప్పిన ధరలకు అమ్మక తప్ప లేదని రైతులు వాపోయారు. బుధవారం గరిష్ట ధర రూ.6,830 పలికినా తేమ శాతం బూచిగా చూపెట్టి క్వింటాకు రూ.5,000 నుంచి 6,300 ధర మాత్రమే చెల్లించారని రైతులు చెప్పారు.
సీసీఐ సెంటర్లలో 9,870
క్వింటాళ్ల కొనుగోళ్లు
ప్రైవేట్‌లో 2,401 క్వింటాళ్లు..
మద్దతు ధర క్వింటాకు రూ.8,110
వరంగల్ మార్కెట్‌లో గరిష్ట ధర రూ.6,830


