ఏం సాధించారని విజయోత్సవాలు
హన్మకొండ: కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి ఏం సాధించారని విజయోత్సవాలు నిర్వహిస్తారని భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కుండె గణేశ్ ప్రశ్నించారు. సర్దార్ వల్లభాయి పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని బుధవారం హనుమకొండలోని అంబేడ్కర్ విగ్రహం నుంచి హంటర్ రోడ్‌లోని సత్యం కన్వెన్షన్ వరకు బీజేవైఎం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కన్వెన్షన్‌లో నిర్వహించిన బీజేవైఎం వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి విస్తృత కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండేళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించింది ఏమీ లేదన్నారు. ఎన్నికల హామీలు అమలు చేయలేని సీఎం రేవంత్‌రెడ్డి విజయోత్సవాలు జరుపుతామనడం విడ్డూరంగా ఉందన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అధికార దుర్వినియోగం చేసి గెలిచిందన్నారు. ఓరుగల్లు నుంచి తన మొదటి పర్యటన ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. బీజేవైఎం హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షులు తీగల భరత్ గౌడ్, ఎర్రగొళ్ల భరత్ వీర్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.
మడికొండలో గణేశ్‌కు ఘనస్వాగతం..
సర్దార్ వల్లభాయి పటేల్ 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా బీజేవైఎం హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బైక్ ర్యాలీకి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు కుండే గణేశ్‌కు మడికొండలో ఘనస్వాగతం పలికారు. నాయకులు తక్కళ్లపల్లి నిఖిల్‌రావు, పొనగోటి వెంకట్‌రావు, మహేందర్, అజయ్, కల్యాణ్, తదితరులు పాల్గొన్నారు.
బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేశ్


