మార్చిలో కాజీపేట రైల్వే యూనిట్ ప్రారంభం
కాజీపేట రూరల్ : కాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ (మల్టీపర్పస్ కోచ్‌ఫ్యాక్టరీ) వచ్చే సంవత్సరం మార్చి నాటికి ప్రారంభించేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోందని వరంగల్ ఎంపీ కడియం కావ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు అన్నారు. కాజీపేట రైల్వే యూనిట్‌లో జరుగుతున్న పనుల పురోగతి, మౌలిక వసతుల అభివృద్ధి, ఆయా విభాగాల నిర్మాణ పనులను బుధవారం పరిశీలించారు. అనంతరం రైల్వే అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల 30 ఏళ్ల కల త్వరలోనే నెరవేరబోతుందని, కాంగ్రెస్ పాలనలోనే ఇది సాధ్యమైందన్నారు. రైల్వే యూనిట్‌లో సంవత్సరానికి 600 కోచ్‌ల తయారీతో పాటు, వందేభారత్ కోచ్‌లను కూడా తయారు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే, 300 ఎకరాల్లో నష్కల్–ఘన్‌పూర్ మధ్య మరో రైల్వే ప్రాజెక్ట్ పీఓహెచ్ వర్క్‌షాప్ నిర్మాణానికి కూడా సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. రైల్వే యూనిట్‌లో భూములు కోల్పోయిన కుటుంబాలకు ఉద్యోగాల కల్పన విషయంలో సంబంధిత అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఎంఈ ఆనంద్, జీజీఎం మురళీకృష్ణ, అధికారులు శర్మ, కృష్ణ, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. కాగా, ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాగరాజును అయోధ్యపురం భూ నిర్వాసితులు కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. భూమి కోల్పోయిన తమకు న్యాయం చేయాలని వినతి పత్రం అందజేశారు.
రైల్వే పీఓహెచ్ వర్క్ షాప్‌నకు సన్నాహాలు
భూ నిర్వాసితులకు ఉద్యోగావకాశం
ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే నాగరాజు


