విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపే లక్ష్యం
వరంగల్ ప్రభుత్వ పాఠశాలల్లో ఖాన్ అకాడమీ తరగతులు ● గణితం, సైన్స్ సబ్జెక్టుల్లో ఉచిత డిజిటల్ క్లాసులు
కాళోజీ సెంటర్: ప్రస్తుత డిజిటల్ యుగంలో విద్యావ్యవస్థ వేగంగా మారుతోంది. తరగతి గదుల్లో ఉపాధ్యాయులు బోధించే పాఠాలకు తోడుగా విద్యార్థులకు సాంకేతిక ఆధారిత అభ్యాసం అందించడం అత్యవసరమైంది. ఈనేపథ్యంలో విద్యార్థులు గణితం, సైన్స్ సబ్జెక్టుల్లో నైపుణ్యం సాధించేందుకు అంతర్జాతీయంగా పేరుగాంచిన ఖాన్ అకాడమీ ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత తరగతులు ప్రారంభించింది. జిల్లాలో 121 ప్రభుత్వ పాఠశాలలు, 10 కేజీబీవీలు, 6 టీజీఎంఎస్, 1 టీజీఆర్‌ఈఐ ఎస్, 1 యూఆర్‌ఎస్ మొత్తం 139 పాఠశాలలు ఉన్నాయి. 6 నుంచి 10వ తరగతి వరకు గణితం, సైన్స్ బోధించే ఉపాధ్యాయులతోపాటు విద్యార్థులు ఖాన్ అకాడమీ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకొని డిజిటల్ తరగతులు వింటున్నారు. విద్యార్థులు ఆయా సబ్జెక్టుల్లో నైపుణ్యాలు సాధించేలా కృషిచేస్తున్నారు.
గణితంలో వీడియోలతో బోధన..
గణితంలో ముఖ్య భావనలను అర్థం చేసుకోకపోవడంతో విద్యార్థులు పట్టు సాధించలేకపోతూ వెనుకబడుతున్నారు. చిన్నచిన్న వీడియోలుగా సులభమైన భాషలో ఖాన్ అకాడమీ విద్యార్థులకు బోధన చేస్తోంది. కూడిక, తీసివేత, భిన్నాలు, బీజగణితం, జ్యామితి, త్రికోణమితిలో విద్యార్థి తప్పు చేస్తే వెంటనే ఎందుకు తప్పో చూపిస్తుంది. ఇది సమస్య పరిష్కార నైపుణ్యలను వివరిస్తుంది. వేగంగా నేర్చుకోవాలనుకునే వారు ప్రాథమికంగా బలోపేతం అవుతారు.
సైన్స్‌లో యానిమేషన్ రూపంలో..
భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్ర భావాల వీడియోలు ఉంటాయి. శక్తులు, చలనం, శక్తి ఆవర్తన పట్టిక, ప్రతి చర్యలు యానిమేషన్ రూపంలో అర్థమయ్యేలా చూపిస్తారు. సైన్స్ ఒక పాఠ్యపుస్తకం కాదు, కాన్సెప్ట్స్‌ను చూసే చేర్చుకునేందుకు ఖాన్ అకాడమీ సాయపడుతుంది. దీని ద్వారా ఆత్మవిశ్వాసం, విద్యార్థి వేగంలో నేర్చుకోవడంతో భయం, ఒత్తిడి తగ్గుతుంది. పాఠాలు అర్థంకాక పోతే మళ్లీ మళ్లీ చూడవచ్చు. దీని ద్వారా డిజిటల్ అక్షరాస్యత పెరుగుతుంది.
ఖాన్ అకాడమీతో డిజిటల్ బోధన
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సాంకేతిక (డిజిటల్) ఆధారిత విద్య అందించడం అత్యవసరం. ఈనేపథ్యంలో ప్రభుత్వ విద్య బలోపేతం కోసం అంతర్జాతీయంగా పేరు గాంచిన ఖాన్ అకాడమీ ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా పాఠాలు బోధిస్తోంది. జిల్లాలో 90 శాతం మంది ఉపాధ్యాయులు, విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసుకోని వారు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
– ఉండ్రాతి సుజన్‌తేజ, వరంగల్ జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి
విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపే లక్ష్యం


