ఇక.. బడిబయటి పిల్లల సర్వే
ఇంటింటికి తిరగనున్న సీఆర్పీలు, ఐఈఆర్పీలు ● ఉమ్మడి జిల్లాలో నేటినుంచి ప్రారంభం
విద్యారణ్యపురి: బడి బయటి పిల్లలను గుర్తించేందుకు నేటి(గురువారం)నుంచి సీఆర్పీలు ఇంటింటి సర్వే చేయనున్నారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లా పరిధిలోని ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారులు కార్యాచరణ రూపొందించారు. కొన్ని సామాజిక, ఆర్థిక పరిస్థితులతో కొందరు పిల్లలు పాఠశాలలకు దూరమవుతున్నారు. మరికొందరు ప్రాథమికస్థాయి విద్య తర్వాత మధ్యలోనే డ్రాపౌట్ అవుతున్నారు. అలాంటి పిల్లలను గుర్తించి బడిబాట పట్టించేందుకు సర్వే నిర్వహించాలని విద్యాశాఖ రాష్ట్ర సమగ్రశిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ ఇటీవల విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. అందుకు మార్గదర్శకాలు విడుదల చేశారు.
ఇంటింటి సర్వే
సీఆర్పీలు, ఐఈఆర్పీలు తమతమ హ్యాబిటేషన్ స్థాయిలో ఇంటింటికెళ్లి సర్వే నిర్వహించనున్నారు. హనుమకొండ జిల్లాలో ఈ నెల 20నుంచి డిసెంబర్ 31వరకు సీఆర్పీలు 36 మంది, ఐఈఆర్పీలు 14మంది ఐదు ఫార్మట్లలో ఈ సర్వే చేయనున్నారు. పాఠశాలలకు రాని పిల్లలు, మధ్యలోనే చదువు మానేసిన పిల్లలు, ప్రత్యేక అవసరాల పిల్లలను గుర్తించాల్సి ఉంటుంది.
రెండు రకాల గ్రూపులుగా పిల్లలు
ఈ సర్వేలో రెండు రకాల గ్రూపులుగా పిల్లలను గుర్తించాలి. బడిబయట ఉన్న పిల్లల్లో 6 ఏళ్ల నుంచి 14 ఏళ్ల వయస్సు వరకు, 15 ఏళ్లనుంచి 19 ఏళ్ల వయస్సు వరకు గల బడిబయట ఉన్నవారిని గుర్తిస్తారు. ఆయా పిల్లల వివరాలను ప్రబంధ్ పోర్టల్‌లో నమోదు చేస్తారు. 2026, జనవరి 2న మండల స్థాయి సమీకరణ, సమస్యలు, వయస్సువారీగా, పాఠశాలల వారీగా వివరాలు సేకరించి తుది జాబితా రూపొందిస్తారు. అనంతరం డీఈఓలకు నివేదిస్తారు. వీరు జనవరి 12న తుది నివేదికను సమగ్రశిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్‌కు అందజేయనున్నారు.
అవసరమైతే ప్రత్యేక
పాఠశాలలు కూడా..
బడిబయట ఉన్న బడీడు పిల్లల్లో వలసదారులు ఉంటే వారిని, వలసవెళ్లిన తల్లిదండ్రుల పిల్లలు ఉంటే వారిని ప్రత్యేకంగా ఈ సర్వే ద్వారా గుర్తిస్తారు. వీరికి అవసరమైతే ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేస్తారు. అందులో సీజనల్ హాస్టళ్లుగా నాన్ రెసిడెన్షియల్‌గా ఏర్పాటు చేస్తారు. మిగతా బడిబయటి పిల్లలను హ్యాబిటేషన్ల వారీగా సమీప ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించనున్నారు.
అందరికీ విద్య అందించాలనే సంకల్పం
బడీడు పిల్లలందరికీ విద్య అందించాలన్నదే ఈ సర్వే లక్ష్యం. వివిధ కారణాలతో బడిబయట ఉన్న పిల్లలను గుర్తించి పాఠశాలలను చేర్పించనున్నారు. హనుమకొండ జిల్లాలో 36 స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో సీఆర్పీలు హ్యాబిటేషన్ల వారీగా సర్వే నిర్వహించి వివరాలను ప్రబంధ్ పోర్టల్‌లో నమోదు చేస్తారు.
– మన్మోహన్, హనుమకొండ జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్
ఇక.. బడిబయటి పిల్లల సర్వే


