5.O అమలు తీరు పరిశీలన
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో సురక్షిత, శుభ్రమైన పాఠశాల 5.O కార్యక్రమ అమలు తీరును మంగళవారం రాష్ట్ర పరిశీలకులు ఎస్‌ఐఈటీ ప్రొఫెసర్ డాక్టర్ రవికాంత్ పరిశీలించారు. దామెర, పరకాల, నడికూడ, శాయంపేట మండలాల్లో ఆయన పర్యటించారు. దామెరలోని ఉన్నత పాఠశాల, శాయంపేటలోని కేజీబీవీ, పరకాలలో బాలుర ఉన్నత పాఠశాల, పులిగిల్ల ప్రాథమికోన్నత పాఠశాల, చర్లపల్లి ప్రాథమిక పాఠశాలను పరిశీలించారు. ఆయా పాఠశాలల్లో స్వచ్ఛత గురించి హెచ్‌ఎంలు రోజువారీ కార్యాచరణ ప్రణాళికలు ఎలా అమలు చేస్తున్నారనేది తెలుసుకున్నారు. తరగతి గదులు, వంట గది, గ్రంథాలయం, ప్రయోగశాల, ఆటస్థలం, మూత్రశాలల్లో పరిశుభ్రతను పాటిస్తున్నారా లేదా? తెలుసుకున్నారు. ఆయా పాఠశాలల్లో హెచ్‌ఎంలతో మాట్లాడారు. కాగా, బుధవారం పలు పాఠశాలల పరిశీలన అనంతరం ఆయన డీఈఓ కార్యాలయంలో సమీక్షించనున్నారు. రవికాంత్ వెంట హనుమకొండ జిల్లా కమ్యునిటీ మొబిలైజింగ్ కో–ఆర్డినేటర్ బద్దం సుదర్శన్‌రెడ్డి, ఆయా మండలాల విద్యాఽధికారులు రాజేశ్, భిక్షపతి, రమాదేవి, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో డిగ్రీ కోర్సుల బీఏ, బీకాం, బీబీఎం, బీఎస్సీ తదితర కోర్సుల మొదటి, ఐదో సెమిస్టర్ పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు హనుమకొండలోని రెండు పరీక్ష కేంద్రాలను పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ వెంకటయ్య పరీక్షల తీరును పరిశీలించారు. ఈనెల 19న డిగ్రీ కోర్సుల మూడో సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమవుతాయని వారు తెలిపారు.
విద్యార్థుల గైర్హాజరుపై అదనపు కలెక్టర్
అసంతృప్తి
హసన్‌పర్తి: విద్యార్థులు పాఠశాలకు గైర్హాజరైతే ఫలితాలు ఎలా సాధ్యమవుతాయని అదనపు కలెక్టర్, ఇన్‌చార్జ్ డీఈఓ వెంకటరెడ్డి హసన్‌పర్తిలోని జిల్లా పరిషత్ బాలుర, బాలికల పాఠశాల హెచ్‌ఎంను ఆదేశించారు. నషా ముక్త్ కార్యక్రమంలో భాగంగా, మంగళవారం పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి ఆయన హాజరై పాఠశాలల్లోని రికార్డులు పరిశీలించారు. బాలుర పాఠశాలలో విద్యార్థుల నమోదు శాతంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నాలుగు రోజులుగా గ్యాస్ సిలిండర్లు సరఫరా కాకపోవడం వల్ల కట్టెల పొయ్యిమీదనే వంట చేస్తున్నట్లు బాలుర పాఠశాలలో మధ్యాహ్న భోజనం నిర్వహిస్తున్న మహిళా సంఘాల సభ్యులు వెంకటరెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్యనందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు. వారిచే ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఏఎంఓ ఇన్‌చార్జ్ డీఈఓ వెంకట్, వన్మోహన్, ప్రధానోపాధ్యాయులు సుమాదేవి, విజయలక్ష్మి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో బడిబయటి పిల్లల సర్వే అమలుపై జిల్లా స్థాయి కీలక సమావేశాన్ని కలెక్టరేట్‌లో ఈనెల 19న మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్నారు. సమావేశానికి ఎంఈఓలు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎంలు, సీఆర్పీలు, ఐఈఆర్పీలు, ఎంఐఎస్ కో–ఆర్డినేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, కేజీబీవీలు, యూఆర్‌ఎస్‌లు, కార్మిక, మహిళా శిశుసంక్షేమ, పోలీస్‌వంటి అధికారులు హాజరు కావాల్సి ఉంటుందని హనుమకొండ అదనపు కలెక్టర్, ఇన్‌చార్జ్ డీఈఓ ఎ.వెంకటరెడ్డి, జిల్లా క్వాలిటీ కో–ఆర్డినేటర్ బండారు మన్మోహన్ మంగళవారం తెలిపారు. సర్వే చేపట్టడంలో అనుసరించాల్సిన మార్గదర్శకాలు, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో డేటా ఎంట్రీ, ధ్రువీకరణకు సంబంధించిన అంశాలు ఈ సమావేశంలో చర్చించనున్నారు. సంబంధిత అఽధికారులు సమగ్ర వివరాలతో విధిగా సమావేశానికి హాజరు కావాల్సి ఉంటుంది.
5.O అమలు తీరు పరిశీలన


