నేటినుంచి మళ్లీ పత్తి కొనుగోళ్లు
సాక్షిప్రతినిధి, వరంగల్:
పత్తి కొనుగోళ్లపై 48 గంటల ప్రతిష్ఠంభనకు తెరపడింది. కాటన్, జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్, మార్కెటింగ్, సీసీఐ, వ్యవసాయశాఖల మంత్రులు, అధికారుల చర్చలు సఫలమయ్యాయి. ప్రభుత్వం, సీసీఐల నుంచి స్పష్టమైన హామీ రావడంతో బుధవారం నుంచి పత్తి కొనుగోలు చేయనున్నట్లు మంగళవారం కాటన్, జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ రాష్ట్ర నాయకత్వం ప్రకటన విడుదల చేసింది. ఈమేరకు వరంగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం సైతం రైతులు పత్తి విక్రయాల కోసం రావొచ్చని ప్రకటించారు.
60 కేంద్రాలకు 39 ప్రారంభం
ఈ సీజన్‌లో పత్తి కొనుగోలు చేసేందుకు సీసీఐ, మార్కెటింగ్, వ్యవసాయశాఖలు 60 జిన్నింగ్ మిల్లులను నోటిఫై చేశారు. అందులో ఈ నెల 15 నాటికి 39 ఓపెన్ కాగా, 1,74,289.78 క్వింటాళ్ల పత్తిని సీసీఐ, ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేసినట్లు అధికారుల రికార్డులు చెబుతున్నాయి. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా రైతులను మోంథా తుపాను నిండా ముంచింది. కనీస మద్దతు ధర క్వింటాకు రూ.8,110కు బదులు తేమ పేరుతో శనివారం కనిష్టంగా రూ.3,969, గరిష్టంగా రూ.7,195లే ఇచ్చారని రైతులు చెబుతున్నారు. ఇలాగైతే పెట్టుబడులు రాక, అప్పుల పాలు కావాల్సిందేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చర్చలు, హామీ మేరకు పత్తి కొనుగోళ్లు
కాటన్ జిన్నింగ్ ఇండస్ట్రీస్ ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, మార్కెటింగ్, సీసీఐ, సీఎండీ ఇతర అధికారులతో మంగళవారం చర్చలు జరిగాయి. వారం, పది రోజుల్లో సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రైతుల శ్రేయస్సు దృష్ట్యా బంద్‌ను విరమించి కొనుగోళ్లు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం జరిగింది.
– బొమ్మినేని రవీందర్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు,
కాటన్ మిల్లర్స్, ట్రేడర్స్ అసోసియేషన్
హైదరాబాద్‌లో సఫలమైన చర్చలు..
ఉమ్మడి వరంగల్‌లో 60 కేంద్రాల ప్రతిపాదన.. 39 చోట్ల కొనుగోళ్లు షురూ
నేటినుంచి మళ్లీ పత్తి కొనుగోళ్లు


