నగరంలో కొత్తగా సిటీ డిపో
ఏర్పాటుకు కసరత్తు చేస్తున్న ఆర్టీసీ అధికారులు ● పీఎం ఈ సేవా పథకంలో 100 ఎలక్ట్రిక్ బస్సుల కేటాయింపు
హన్మకొండ : టీజీఎస్ ఆర్టీసీ.. వరంగల్ రీజియన్‌లో సేవలు విస్తరణకు పూనుకుంది. దేశంలో ప్రజా రవాణా వ్యవస్థలను మెరుగుపర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఈ–బస్ సేవా పథకాన్ని తీసుకువచ్చింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఎలక్ట్రిక్ బస్సులను సమకూరుస్తోంది. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలో రెండో పెద్ద నగరమైన వరంగల్ మహానగరానికి 100 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించింది. ఈ బస్సులను సిటీతోపాటు నగర శివారు గ్రామాలను నడిపేలా ఆ సంస్థ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. వీటి నిర్వహణకు కొత్తగా సిటీ డిపో ఏర్పాటుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
మహానగర పరిధిలోనే..
గతంలో సిటీ బస్సులు నడిపిన హనుమకొండ డిపో ప్రస్తుతం సిటీతోపాటు జిల్లా బస్సులు నడుపుతోంది. ఇప్పటికే రీజియన్‌లో 9 డిపోలున్నాయి. కొత్తగా ఏటూరునాగారం డిపో మంజూరు చేయగా నిర్మాణ పనులు సాగుతున్నాయి. డిపో నిర్వహణ సజావుగా సాగాలంటే 100 బస్సుల సామర్థ్యం సరిపోతుంది. ప్రస్తుతం 9 డిపోలకు 1,005 బస్సులుండడంతో ఉద్యోగులపై పనిభారం పడుతోంది. నిర్వహణలో ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో మరో 100 బస్సులు సిటీకి రానుండడంతో కొత్త సిటీ డిపో ఏర్పాటు తప్పని సరైంది.
మొత్తం రూ.20 కోట్ల ప్రాజెక్టు..
కొత్తగా బస్ డిపో ఏర్పాటు, ఎలక్ట్రిక్ బస్సులు రావడం మొత్తం రూ.20 కోట్ల ప్రాజెక్టు. ఇందులో రూ.10కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తోంది. డిపో ఏర్పాటుకు స్థలం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ సమకూర్చాలి. ఈ క్రమంలో వరంగల్ మహానగర పరిధిలో డిపో ఏర్పాటుకు అధికారులు స్థల పరిశీలన చేస్తున్నారు. రెవెన్యూ అధికారులను కలిసి స్థలం కోసం లేఖలు అందించారు. మరోవైపు ప్రజాప్రతినిధులను కలిసి ఆర్టీసీ అవసరమైన స్థలం కేటాయింపునకు సహకారం కోరాలనే ఆలోచనలో ఆర్టీసీ అధికారులు ఉన్నారు. కొత్తగా డిపో ఏర్పాటు కు కనీసం 5 నుంచి 6 ఎకరాల స్థలం అవసరం. ఈ స్థలం నగరంతోపాటు విలీన గ్రామాల పరిధిలో లభ్యమైతే ఆర్టీసీ బస్సుల నిర్వహణ, రవాణాకు అనుకూలంగా ఉంటుంది. ఎంత త్వరగా స్థలం ఖరారు అయితే అంత త్వరగా డిపో నిర్మాణం, విద్యుత్ సబ్ స్టేషన్, చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేసే పనులు మొదలవుతాయి. 100 బస్సులకు కనీసం 20 చార్జింగ్ పాయింట్లు అవసరమవుతాయి.
ఉన్న స్థలం లీజుకు..
హనుమకొండ హంటర్ రోడ్డులోని ఆర్టీసీ టైర్ రిట్రేడింగ్ సెంటర్‌ను కరీంనగర్‌కు తరలించి ఆ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు లీజుకు ఇచ్చారు. లీజుదారులు ఇందులో హోటల్‌తోపాటు ఫంక్షన్ హాల్ నిర్మించి ఆదాయం పొందుతున్నారు. భవిష్యత్ అవసరాలను గుర్తించకుండా సొంత స్థలాన్ని లీజుకు ఇచ్చి, ఇప్పుడు సంస్థ సొంత అవసరాలకు ప్రభుత్వం, దాతలపై ఆధారపడాల్సిన దుస్థితి నెలకొంది. ఆ స్థలం ఉంటే ఇప్పుడు ఆర్టీసీకి ఉపయుక్తంగా ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నగర పరిధిలో స్థలం కోసం అన్వేషణ
ప్రస్తుతం వరంగల్ రీజియన్‌లో
9 డిపోలు..
ఏటూరునాగారంలో
నిర్మాణమవుతున్న డిపో..
కొత్తదానితో 11కు చేరనున్న సంఖ్య
ప్రస్తుతం ఆర్టీసీ వరంగల్ రీజియన్‌లో ఇలా..
డిపోలు 9
మొత్తం బస్సులు 1,005
ఆర్టీసీవి 572
అద్దె బస్సులు 321
అద్దె ఎలక్ట్రిక్ 112


