పొగమంచులో ప్రయాణాలు చేయొద్దు : సీపీ
వరంగల్ క్రైం : ‘వాతావరణంలో పొగమంచు ప్రభావం పెరుగుతోంది. వీలైనంత వరకు వాహనదారులు రాత్రి, తెల్లవారుజామున ప్రయాణాలు చేయొద్దు’ అని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ ప్రజలకు సూచించారు. పొగమంచు వల్ల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని, రాత్రి, తెల్లవారుజామున రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించవని పేర్కొన్నారు. పొగమంచు ఎక్కువగా ఉండే వేళల్లో వాహనాలను వేగంగా నడపొద్దని శ్రద్ధతో, నిదానంగా ప్రయాణించాలని సూచించారు. తక్కువ వీక్షించే సామర్థ్యం కారణంగా ఇతర వాహనాలు, పాదచారులు, మలుపులు, రోడ్డు విభాగాలు సరిగా కనిపించక ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నందున, హెడ్‌లైట్లను బీమ్‌లో ఉంచి, ఫాగ్ లైట్లను వాడాలని సూచించారు. అత్యవసర సమయాల్లో ప్రయాణం తప్పనిసరి అయితే వాహనాల స్థితిని ముందుగానే తనిఖీ చేసుకోవడంతోపాటు ముఖ్యంగా బ్రేకులు, లైట్లు, టైర్లు సరిగా ఉన్నాయో లేదో సరి చూసుకోవాలని వివరించారు. డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం, ఆకస్మికంగా ఓవర్ టెక్ చేయడం, ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించడం వంటి ప్రమాదకరమైన చర్యలకు పాల్ప డొద్దని సూచించారు. పోలీసుల సూచనలతోపాటు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ వాహనదారులు గమ్యస్థానాలకు క్షేమంగా చేరుకోవడమే వరంగల్ పోలీసుల ప్రధాన లక్ష్యమని సీపీ వెల్లడించారు.
వరంగల్ లీగల్ : తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి, వరంగల్ జిల్లా అడ్మినిస్ట్రేటివ్ న్యాయమూర్తి విజయసేనారెడ్డిని సోమవారం బార్ అసోసియేషన్ జిల్లా ప్రతినిధులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా జడ్జిని శాలువాతో సత్కరించి, పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. అనంతరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వలస సుధీర్ మాట్లాడారు. వరంగల్ జిల్లా కోర్టును వరంగల్ ప్రాంతానికి తరలించడం, ప్రత్యేక ఫ్యామిలీ కోర్టు మంజూరు, అడిషనల్ సబ్ కోర్టు ఏర్పాటు, కోర్టు హాల్‌లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటాన్ని ఆవిష్కరించేందుకు అనుమతి, బార్ అసోసియేషన్ భవనానికి లిఫ్ట్ ఏర్పాట్లపై విన్నవించగా న్యాయమూర్తి సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు. ఉపాధ్యక్షుడు మైదం జయపాల్, ప్రధాన కార్యదర్శి దండావంతుల రమాకాంత్, సురేష్ పాల్గొన్నారు.
హన్మకొండ : ప్రయాణికుల అవసరాల మేరకు రవాణా సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయభాను తెలిపారు. సోమవారం హనుమకొండ జిల్లా బస్‌స్టేషన్‌లో శ్రీశైలం, తిరుపతికి ఏసీ రాజధాని బస్సును ఆర్‌ఎం విజయభాను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తిరుపతికి వెళ్లే బస్సు ప్రతిరోజూ ఉదయం 8:40కి, శ్రీశైలం బస్సు ప్రతిరోజూ ఉదయం 9గంటలకు హనుమకొండ బస్‌స్టేషన్ నుంచి బయలుదేరుతుందన్నారు. వయా ఉప్పల్ రింగ్‌రోడ్, ఎల్బీనగర్, సాగర్ రింగ్‌రోడ్ ద్వారా ఈ సర్వీస్ అందుబాటులో ఉంటుందన్నారు. డిప్యూటీ ఆర్‌ఎం(ఆపరేషన్) భానుకిరణ్, వరంగల్–1 డిపో మేనేజర్ అర్పిత, బస్ స్టేషన్ మేనేజర్ మల్లేశం పాల్గొన్నారు.
ఎంజీఎం: వరంగల్, భూపాలపల్లి, జనగామ జిల్లాల పరిధిలోని పలు మెడికల్ షాపుల్లో డ్రగ్స్ అండ్ కంట్రోల్ అధికారులు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేసినట్లు ఔషధ నియంత్రణ పరిపాలన ఉమ్మడి వరంగల్ జిల్లా సహాయ సంచాలకులు రాజ్యలక్ష్మి తెలిపారు. ఈ తనిఖీల్లో ఔషధాలు, సౌందర్య సాధనాల చట్టం–1940 నిబంధనలు, 1945లోని నిబంధనలు ఉల్లంఘించిన పలు మెడికల్ దుకా ణాలకు నోటీసులు జారీ చేశామని పేర్కొ న్నారు. మత్తు అలవాటు కలిగించే మందులను, యాంటీబయోటిక్స్‌ను అర్హత ఉన్న వైద్యుల ప్రీస్క్రిప్షన్ లేకుండా విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. ప్రతీ కొనుగోలు దారుడికి తప్పకుండా బిల్లు ఇవ్వాలని సూచించారు. ఈ తనిఖీల్లో ఔషధ నియంత్రణ అధికారి జున్ను కిరణ్ కుమార్, బాలకృష్ణ, పి.పావని తదితరులు పాల్గొన్నారు.
పొగమంచులో ప్రయాణాలు చేయొద్దు : సీపీ
పొగమంచులో ప్రయాణాలు చేయొద్దు : సీపీ


