కాంగ్రెస్ పాలనలో రైతుల ఆత్మహత్యలు
హన్మకొండ : పదేళ్ల పాలనలో కేసీఆర్ రైతును రాజును చేస్తే.. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఆత్మహత్యలకు గురిచేస్తోందని బీఆర్‌ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ విమర్శించారు. సోమవారం హనుమకొండ బాలసముద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలోఆయన విలేకరులతో మాట్లాడారు. రైతులు పండించిన పంటను కొనుగోలు చేయలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు. రెండేళ్ల పాలనలో రాష్ట్రంలో 500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే 7లక్షల మంది పత్తి రైతులు ఉన్నారని తెలిపారు. తేమశాతం, కపాస్ యాప్ రిజిస్ట్రేషన్, జిన్నింగ్ మిల్లుల అవినీతి అంటూ కుంటి సాకులతో కొనుగోలు నిరాకరిస్తున్న సీసీఐ వైఖరి పట్ల నిరసన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వానికి పత్తి కొనుగోలుపై నిర్దిష్ట విధానం లేదని విమర్శించారు. ఉమ్మడి జిల్లా నుంచి కొండా సురేఖ, సీతక్క అనసూయ మంత్రులుగా ఉన్న రైతులకు ఒరిగింది ఏమీ లేదని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాట్లాడుతూ పత్తి రైతులు గోసపడుతుంటే రేవంత్ రెడ్డి సర్కార్ మొద్దు నిద్రలో ఉందని విమర్శించారు. మాజీ మంత్రి హరీశ్‌రావు నేడు(మంగళవారం) ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌ను సందర్శించి పత్తి రైతులతో మాట్లాడి నేరుగా సమస్యలు తెలుసుకుంటారని తెలిపారు.
బీఆర్‌ఎస్ హనుమకొండ జిల్లా
అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్
నేడు ఏనుమాముల మార్కెట్‌కు హరీశ్‌రావు
వరంగల్ : పత్తి కొనుగోళ్లు బంద్ చేసినందున రైతులు పడుతున్న ఇబ్బందులను పరిశీలించేందుకు మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు నేడు (మంగళవారం) ఉదయం 9గంటలకు ఏనుమాములలోని వరంగల్ వ్యవసాయ మార్కెట్‌ను సందర్శిస్తారని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. యార్డును పరిశీలించి రైతులతో మాట్లాడి ఇబ్బందులు తెలుసుకుంటారని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్ పాలనలో రైతుల ఆత్మహత్యలు


