పిండవుతున్న పచ్చని కొండలు
కాజీపేటకు పొంచి ఉన్న ఉపద్రవం
కాజీపేట: ప్రాణ వాయువునిచ్చే పర్యావరణ కవచాలు సహజసిద్ధ పచ్చని కొండలు. ఇలాంటి ప్రకృతి సంపదను కొందరు చెరబడుతున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా ఇష్టారీతిన తవ్వేస్తున్నారు. గ్రేటర్ వరంగల్ నగరానికి రక్షణ కవచంగా చుట్టూ పదుల సంఖ్యలో కొండలు, గుట్టలున్నాయి. ఇవి కొన్నేళ్లుగా కరిగిపోతున్నాయి. గుట్టలు, కొండలపై కురిసే వర్షం అక్కడినుంచే వాగులు, వంకల్లోకి వెళ్తుంది. ఇప్పుడు వాటి చుట్టూ ఉన్న కొండలను పిండి చేస్తున్నారు. గుట్టల నలువైపులా ఉన్న ఎర్రమట్టిని తవ్వి తరలిస్తున్నారు. నీరొచ్చే మార్గాలు కనుమరుగవుతుండటంతో వర్షం నీరు ఎక్కడికి పోవాలి? నేరుగా పట్టణంలోకే రావాలి? అప్పుడు పరిస్థితి ఏమిటి? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వ శాఖల మధ్య
లోపించిన సమన్వయం..
కాజీపేట చుట్టూ గుట్టలు, కొండలను తోడేసి అక్రమంగా మట్టి, రాయి, గ్రానైట్ వ్యాపారం చేస్తున్న వ్యాపారుల ఆటలను అధికారులు కట్టించలేకపోతున్నారు. వీటి రవాణాను ఎక్కడా తనిఖీలు చేసిన సందర్భాలు లేవు. వాస్తవానికి మైనింగ్ శాఖ ఏడీలు, సర్వేయర్లు, రెవెన్యూ శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో తరచూ పర్యవేక్షించి ఎక్కడ అక్రమ రవాణా చేసినా పట్టుకుని చలానాలు విధించి, వాహనాలు సీజ్‌చేసి కేసు నమోదు చేయాలి. కానీ, ఈ రెండు శాఖల మధ్య సమన్వయం కొరవడిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో వీటి పనితీరు అంతంత మాత్రమేననే వాదనలు ఉన్నాయి. ఇప్పటికై నా రెండు శాఖల అధికారులు సమన్వయంతో కాజీపేట మండలంతో పాటు పట్టణంలో క్షేత్రస్థాయితో పర్యటన చేయాలని పలువురు కోరుతున్నారు. అప్పుడే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న అక్రమ క్వారీల నిర్వహణ వెలుగుచూసే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అధికారులు తనిఖీలు చేయాలని స్థానికుల డిమాండ్


