భువనగిరిలో రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీలు
● 8 ఉమ్మడి జిల్లాల నుంచి పాల్గొన్న 80 మంది క్రీడాకారులు
భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని న్యూ డైమెన్షన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఆదివారం 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్రస్థాయి అండర్–19 బాలబాలికల స్విమ్మింగ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ పి.సుభాష్‌రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. న్యూ డైమెన్షన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆవరణలో జాతీయ, రాష్ట్రస్థాయి క్రీడాపోటీలు నిర్వహించేందుకు అనువైన మైదానాలు ఉన్నాయన్నారు. మొదటిసారిగా జిల్లాలో రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీలు జరగడం సంతోషంగా ఉందన్నారు. 800, 400, 200, 100, 50 మీటర్ల విభాగాల్లో జరిగిన పోటీల్లో 8 ఉమ్మడి జిల్లాల నుంచి మొత్తం 80 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అనంతరం గెలుపొందిన క్రీడాకారులకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కరుణాకర్‌రెడ్డి, పోటీల పర్యవేక్షుడు శ్రీనివాస్‌గౌడ్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రసాద్, బాబురావు, వీవీ రెడ్డి, స్విమ్మింగ్ అసోసియేషన్ హైదరాబాద్ అధ్యక్షుడు గిరిధర్, శ్రీను, ఉమారావు, ఆంజనేయులు, నరసింహ, పీడీ రమేష్‌రెడ్డి, పీఈటీలు పాల్గొన్నారు.
తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు
నాకు చిన్నప్పటి నుంచి స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం. 3వ తరగతి నుంచే స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇప్పటికే నాలుగుసార్లు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నాను. ప్రస్తుతం ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతున్నాను. నా తల్లిదండ్రులు నన్ను ఎంతోగానే ప్రోత్సహిస్తున్నారు.


