‘విశ్వ పరీమళ వీచిక’లో అందమైన పదబంధాలు
● కేంద్రసాహిత్య పురస్కార గ్రహీత
డాక్టర్ అంపశయ్య నవీన్
హన్మకొండ కల్చరల్: పల్లె జీవన సౌందర్యాన్ని అద్భుతంగా ఒడిసిపట్టి, అందమైన పదబంధాలతో అల్లిన ‘విశ్వ పరీమళ వీచిక’ కవిత్వం తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచిందని కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీత డాక్టర్ అంపశయ్య నవీన్ అన్నారు. వరంగల్‌కు చెందిన కవయిత్రి, రచయిత్రి డాక్టర్ వాణీదేవి దేవులపల్లి రచించిన విశ్వ పరీమళ వీచిక కవిత్వం, ఆమె సంపాదకత్వంలో వెలువరించిన యాసంగి ముచ్చట్లు కవితా సంపుటాల పుస్తకావిష్కరణ నయీంనగర్‌లోని వాగ్దేవి డిగ్రీ అండ్ పీజీ కళాశాల సెమినార్‌హాల్‌లో కవయిత్రి, రచయిత్రి అయినంపూడి లక్ష్మి అధ్యక్షతన ఆదివారం జరిగింది. ముఖ్య అతిథిగా అంపశయ్య నవీన్, విశిష్ట అతిథిగా కేయూ విశ్రాంతాచార్యులు బన్న అయిలయ్య, ఆత్మీయ అతిథులుగా గేయ రచయిత మిట్టపల్లి సురేందర్, అమెరికాలోని ఐసీఎస్ వైస్ ప్రెసిడెంట్ రమణ దేవులపల్లి పుస్తకాలు ఆవిష్కరించారు. అనంతరం బన్న అయిలయ్య మాట్లాడుతూ తెలంగాణ పల్లె జీవనాన్ని రచయిత వాణీదేవి దేవులపల్లి తన కవిత్వం ద్వారా తెలియజేశారని అన్నారు. వాణీదేవి మాట్లాడుతూ ఊరు తన జీవనాడి అని, అనుభవాలే కవితలుగా జాలువారాయని పేర్కొన్నారు. 78 మంది కవులు రాసిన కవితలతో యాసంగి ముచ్చట్లు కవితా సంపుటిని వెలువరించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మిట్టపల్లి సురేందర్ తన పాటలతో అలరించారు. కార్యక్రమంలో కవులు, రచయితలు పాల్గొననున్నారు.


