వయోవృద్ధుల సేవలు సమాజానికి అవసరం
హన్మకొండ: సీనియర్ సిటిజన్స్ సేవలు నేటి సమాజానికి ఎంతో అవసరమని హనుమకొండ జిల్లా సంక్షేమ అధికారి జె.జయంతి అన్నారు. ఆదివారం హనుమకొండ జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలోని సీనియర్ సిటిజన్స్ డే కేర్ సెంటర్‌లో తెలంగాణ సీనియర్ సిటిజన్స్ కాన్ఫడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సమావేశానికి జయంతి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. ఉమ్మడి కుటుంబం నుంచి వ్యక్తిగత కుటుంబాలుగా మారుతున్న క్రమంలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, వయో వృద్ధులే వీరికి మార్గదర్శనం చేయాలన్నారు. వయో వృద్ధులు ఎదుర్కొంటున్న సమస్యలకు జిల్లా స్థాయి అధికారులు స్పందిస్తున్నారని, తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ సంరక్షణ చట్టం–2007పై అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో మరో రెండు డే–కేర్ సెంటర్ల ఏర్పాటుకు కలెక్టర్‌తో సంప్రదిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ సీనియర్స్ సిటిజన్స్ కాన్ఫడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.రామచంద్రయ్య మాట్లాడుతూ.. హనుమకొండ జిల్లాలో సీనియర్ సిటిజన్స్ ఉద్యమం బలంగా ఉందన్నారు. సమావేశంలో కాన్పడరేషన్ రాష్ట్ర కార్యదర్శులు విశ్వనాథం, నాగేశ్వర్ రావు, కార్యవర్గ సభ్యులు భూషిరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, నాయకులు దామెర నర్సయ్య, రాపాక నర్సింహరాములు, ఈగ సత్యనారాయణ, నల్లా మనోహర్‌రెడ్డి, కొన్ రెడ్డి మల్లారెడ్డి, కటకం సంపత్, కోమటి రాజేందర్, కజాంపురం దామోదర్, తేరాల యుగంధర్, నాగులగాం నర్సయ్య, చిదురాల సత్యనారాయణ, మార్క రవీందర్‌గౌడ్, తాడూరి లక్ష్మీనారాయణ, గంగారపు యాదగిరి, గంటి సాంబయ్య, గోకారపు రాజేందర్ డే–కేర్ సెంటర్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ ఉష, అసిస్టెంట్, వాణి పాల్గొన్నారు.
హనుమకొండ జిల్లా సంక్షేమ అధికారి జయంతి


