డిగ్రీ సెమిస్టర్ల పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్ , ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో డిగ్రీ కోర్సుల బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ, బీఏఎల్ మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కె. రాజేందర్ ఆదివారం తెలిపారు. డిగ్రీ కోర్సుల మొదటి సెమిస్టర్ పరీక్షలు ఈనెల 18, 20, 22, 25, 27, 29, డిసెంబర్ 2,4 తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్వహించనున్నారు. మూడో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 19, 21, 24, 26, 28 డిసెంబర్ 1, 3, 5, 8 తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు నిర్వహించనున్నారు. ఐదో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 18, 20, 22, 25, 27, 29, డిసెంబర్ 2, 4, 6, 9, 11, 12, 15 తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తామని రాజేందర్ తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 44, ఖమ్మం జిల్లాలో 26, ఆదిలాబాద్ జిల్లాలో 46, మొత్తం.. 116 పరీక్షకేంద్రాలు ఏర్పాటుచేశారు. 116 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 128 మంది అబ్జర్వర్లను నియమించినట్లు తెలిపారు. మొత్తం 1,35, 461మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారని రాజేందర్ పేర్కొన్నారు. ఈనెల 15న సంబంధిత కేయూ వెబ్‌సైట్‌లో విద్యార్థుల హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. వెబ్‌సైట్ నుంచి కూడా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.
● కేయూ పరిధిలో 116 పరీక్ష కేంద్రాలు
● హాజరుకానున్న 1,35, 461 మంది..
● వెబ్‌సైట్‌లో విద్యార్థుల హాల్‌టికెట్లు


